---Advertisement---

జనసేనలో పదవుల పోరు.. మొదలైన రాజీనామాల పర్వం

May 24, 2026

---Advertisement---

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. 29వ వార్డుకు చెందిన జనసేన సాధక్, వార్డు అధ్యక్షుడు అంగటి శ్రవణ్ కుమార్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

జనసేన చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న శ్రవణ్ కుమార్ 500కు పైగా సభ్యత్వాలు నమోదు చేసి “జనసేన సాధక్” బిరుదును పొందారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబరిచిన వారికి పదవులు ఇస్తామని పార్టీ అంతర్గతంగా ప్రచారం జరగడంతో, ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ చివరికి నాయకులకు అనుకూలంగా ఉన్న వారికే అవకాశాలు దక్కుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యక్తులకు తొత్తులుగా వ్యవహరించే వారికే పదవులు కట్టబెడుతున్నారని, ఆత్మాభిమానాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేనని పేర్కొంటూ తన రాజీనామా లేఖను ఎమ్మెల్యే వంశీకి పంపినట్లు సమాచారం. ఈ పరిణామం జనసేనలోని అసంతృప్తిని మరింత బయటపెట్టిందనే చర్చ సాగుతోంది.

ఇప్పటికే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలువురు జనసేన నాయకులు పార్టీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతుండగా, మరికొందరు కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంతర్గత కుమ్ములాటను పవన్ కళ్యాణ్ సమయానికి చక్కదిద్దుతారా? లేక ఇది పార్టీకి పెద్ద సమస్యగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment