రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలోని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భూమిగా చెబుతున్న కోడి చెరువు (Kodi Lake) వివాదం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కొత్త సంచలనంగా మారింది. చెరువు కబ్జాకు గురైందనే ఆరోపణలు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఇచ్చిన వివరణ, క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు మరియు సామాజిక కార్యకర్తలు చూపిస్తున్న ఆధారాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.
ఒక టీవీ ఇంటర్వ్యూలో రంగనాథ్ (Ranganath) మాట్లాడుతూ కోడి చెరువు మొత్తం 26.07 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉందని, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 2014లో ఇక్కడ 10 ఎకరాల భూమిని(Land) కొనుగోలు చేశారని చెప్పారు. చెరువు పరిధిలో పట్టా భూములు ఉండటం అసాధ్యమేమీ కాదని, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఉదాహరణలు ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ వేయడం టెక్నికల్‌గా తప్పేనని అంగీకరించినప్పటికీ, అది నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదని ఆయన వాదించారు. పవన్ కళ్యాణ్ అక్కడ మట్టి నింపలేదని, కేవలం తన భూమి సరిహద్దును కాపాడుకోవడానికి ఫెన్సింగ్ వేసుకున్నారని, దీనిని కబ్జా అనలేమని స్పష్టం చేశారు.
అయితే ఈ వివరణపై జర్నలిస్ట్ రఘు మరియు సామాజిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాల్టా చట్టం ప్రకారం చెరువు శిఖం భూముల్లో బోర్లు వేయడం నేరమని, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భూమిలో నిబంధనలకు విరుద్ధంగా బోరు వేసినట్లు ఆధారాలు ఉన్నాయని, కానీ రంగనాథ్ దానిపై మాట్లాడలేదని వారు అంటున్నారు. బయట నుంచి మట్టిని తీసుకొచ్చి చెరువును పూడ్చే ప్రయత్నం జరిగిందని వీడియో ఆధారాలు ఉన్నాయని కూడా ఆరోపిస్తున్నారు.
ఇంకా చెరువు కట్ట వెడల్పు 33 అడుగుల నుంచి 15 అడుగులకు తగ్గించబడిందని, ముళ్ల కంచె వేసి ప్రజలు కట్టమైసమ్మ గుడికి వెళ్లకుండా అడ్డుకుంటున్న విషయాన్ని అధికారులు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సేల్ డీడ్‌లో ఇ-కెవైసీ, ఫోటోలు, వేలిముద్రలు లేవన్న ఆరోపణలపై కూడా స్పందన రాలేదని పేర్కొంటున్నారు. అలాగే వేసిన ఫెన్స్ నీటి ప్రవాహం అడ్డుకునే అంత బలంగా ఉన్నాయని ఫోటోలు చూపిస్తూ నిలదీశారు. అలాగే భూమి సరిహద్దులను సైతం డాక్యుమెంటుల్లో తప్పుగా చూపించారని మరోసారి స్పష్టం చేశారు.


రంగనాథ్ సోషల్ మీడియాలో ఎజెండాతో పని చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలకు రఘు ఘాటుగా స్పందించారు. “ప్రజా ఆస్తులను కాపాడటమే మా ఎజెండా, ప్రభుత్వాలకు వత్తాసు పలకడం మీ ఎజెండా” అని విమర్శించారు. ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలకు స్వయంగా వెళ్లే రంగనాథ్, కోడి చెరువు వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. వెళ్లకుండానే ఆ చెరువు భూమిలో ఎలాంటి నిభందనల ఉల్లంఘనలు జరగలేదని ఎలా చెబుతారు అంటూ నిలదీశారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ పట్ల ఆయన సాఫ్ట్ కార్నర్ చూపుతున్నారనే రాజకీయ చర్చలను కూడా ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో రఘు కోడి చెరువు కబ్జా వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్దమా అంటూ విసిరిన ఓపెన్ ఛాలెంజ్‌కు రంగనాథ్ స్పందిస్తారా లేదా అన్నది ఇరు రాష్ట్రాల్లో ఆశక్తికరంగా మారింది.







