కేంద్ర రాజకీయాల్లో మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నివాసం సమీపంలోని లోక్ కల్యాణ్ మార్గ్ (Lok Kalyan Marg) వద్ద కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ నిరసన చేపట్టింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra), కేసీ వేణుగోపాల్(K.C. Venugopal), పవన్ ఖేరా (Pawan Khera) సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) వెంటనే రాజీనామా (Resignation) చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. చేతులకు సంకెళ్లు వేసుకున్నట్లుగా చేతులు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో లోక్ కల్యాణ్ మార్గ్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గలేదు.
బీజేపీ(BJP) ర్యాలీ సందర్భంగా భద్రతా బలగాలు విద్యార్థులపై వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు కాంగ్రెస్ స్పష్టం చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ (K. Suresh) మాట్లాడుతూ తమను అత్యంత దారుణంగా అదుపులోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై ప్రవర్తించిన తీరుకు నిరసనగా ప్రధాని నివాసం ముందు ఆందోళన చేస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని, కేంద్ర హోంమంత్రి నుంచి కూడా ఎలాంటి స్పందన రావడం లేదని మండిపడ్డారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం పంజాబ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చరణ్జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది బీజేపీ ఉగ్రవాద రాజకీయాలకు నిదర్శనమని, విద్యార్థుల గొంతును వినేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన ఆరోపించారు.







