తనకు రోజుకు కేవలం 4 గంటలపాటు (4 Hours) మాత్రమే పని (Work) ఉంటోందని, అందుకే పూర్తి జీతం కాకుండా సగం జీతమే (Half Salary) చెల్లించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ (Rinku Singh Rahi) రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన ఈ వినూత్న లేఖ పరిపాలనా వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.
2023 బ్యాచ్‌కు చెందిన రింకూ సింగ్ రాహీ (Rinku Singh Rahi) ప్రస్తుతం జలౌన్ (Jalaun) సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా (SDM) విధులు నిర్వహిస్తున్నారు. తనకు పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వడం లేదని, రోజులో కేవలం 4 గంటలపాటు మాత్రమే పని ఉంటోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల పూర్తి జీతం తీసుకోవడం న్యాయం కాదని, సగం జీతం మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాను రాష్ట్రంలో పనిచేసే అర్హత లేని అధికారినని ప్రభుత్వం భావిస్తే వెంటనే మరోచోటికి బదిలీ చేయాలని, ఒకవేళ అర్హత ఉందని నమ్మితే ఇతర ఐఏఎస్ అధికారుల మాదిరిగానే పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని రింకూ సింగ్ విజ్ఞప్తి చేశారు.
తన పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్(Illegal Mining), భూ కబ్జాలపై (Land Encroachments) ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు లొంగకుండా కఠిన చర్యలు తీసుకోవడం వల్లే తనను పక్కనపెట్టి పరిమిత బాధ్యతలు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఒక ఐఏఎస్ అధికారి స్వయంగా సగం జీతమే ఇవ్వాలని కోరడం, పూర్తి స్థాయి పని లేదా బదిలీ కోరడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







