రాష్ట్రంలో విలువైన భూములపై మరో సంచలనాత్మక వ్యవహారం వెలుగులోకి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు (Lepakshi Knowledge Hub) చెందిన 8,844 ఎకరాల భూములపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరుకు సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ భూముల విలువ సుమారు రూ.10 వేల కోట్లకు పైగా ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి.
ఈ విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు రాజకీయంగా ప్రభావవంతమైన అధికార పార్టీ నేత తనకు సన్నిహితులైన వ్యాపారవేత్తలను రంగంలోకి దించి వ్యూహాలు అమలు చేస్తున్నారని పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఎస్సార్ ఇన్‌ఫ్రా సంస్థ అధినేత బలుసు శ్రీనివాసరావు (Balusu Srinivasa Rao) పేరుతో ఈ భూములను తక్కువ ధరకు పొందేందుకు ఒత్తిళ్లు తెస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు జరగగా, ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే—ఇప్పటికే అమరావతిలో ప్రభుత్వ ప్రాజెక్టుల కింద వేల కోట్ల విలువైన పనులు అదే బీఎస్సార్ ఇన్‌ఫ్రా సంస్థకు అప్పగించబడ్డాయి. వాటిలో భాగంగా ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్సులే (Mobilization Advances) ఇప్పుడు ఈ భూముల కొనుగోలుకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, గతంలో ఈ భూములపై తీవ్రమైన విమర్శలు చేసిన రాజకీయ వర్గాలే ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియలో ఈ భూములు కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలపై ఒత్తిళ్లు తెచ్చి వాటిని బదిలీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాజెక్ట్ అసలు లక్ష్యం పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి. 2006లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఐటీ రంగాల సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కానీ రాజకీయ పరిణామాలు, కేసులు, వివాదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. నాడు జగన్ పై అక్రమ కేసులు పెట్టకుండా ఉండి ఉంటే ఈ ప్రాజెక్టు మరో శ్రీ సిటీగా (Sri City) అభివృద్ది అయ్యేదని పలువురు నుండి వినిపిస్తున్న మాట.
ప్రస్తుతం అదే భూములు మరోసారి వార్తల్లో నిలవడంతో, నిజంగా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందా? లేక ఇది మరో భారీ భూదందా కేసా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు కూడా భూముల విలువ తగ్గించి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లేపాక్షి భూముల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. అసలు ఈ డీల్ వెనుక నిజం ఏమిటి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






