బ్రిటన్‌లో (Britain) శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. బెడ్‌ఫర్డ్ (Bedford) సమీపంలో ఒకే మార్గంలో ప్రయాణిస్తున్న 2 ప్యాసింజర్ రైళ్లు (Passenger Trains) ఒకదానికొకటి ఢీకొనడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 2 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒకరు లోకో పైలట్ ఉన్నట్లు నిర్ధారించారు.
రైలు ట్రాకింగ్ వివరాల ప్రకారం, రెండు రైళ్లు లండన్ (London) వైపు దక్షిణ దిశలో ప్రయాణిస్తుండగా సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వెంటనే బోగీలు (Coaches) తీవ్రంగా దెబ్బతినగా, ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎయిర్ అంబులెన్స్ సేవలు, ప్రత్యేక ప్రమాద స్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ప్రయాణించిన పీటర్ నాప్ (Peter Knapp) తన అనుభవాన్ని వివరిస్తూ ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించిందని, తాను ముందున్న సీటుపైకి ఎగిరిపడ్డానని తెలిపాడు. అనంతరం బోగీలో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారని చెప్పాడు. పలువురికి కాళ్లు విరగడంతో పాటు తీవ్ర రక్తస్రావ గాయాలు అయినట్లు వెల్లడించాడు.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కార్బీ నుంచి లండన్‌కు బయలుదేరిన సాయంత్రం 4:40 గంటల సర్వీస్, నాటింగ్‌హామ్ (Nottingham) నుంచి లండన్‌కు(London) వస్తున్న 3:50 గంటల సర్వీస్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనతో లండన్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, సాంకేతిక లోపమా లేదా ఇతర కారణాలా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.






