రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను (Maize Procurement Centers) వెంటనే ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ (Ambati Muralikrishna) ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో మొదలైన దుమారం రైతులపై(Farmers) టీడీపీ(TDP) వర్గియులు దాడులు చేసే వరకు వెళ్లడం తీవ్ర దుమారం రేపుతోంది.
అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాసినా, కొనుగోలు కేంద్రాల ప్రారంభ తేదీలపై స్పష్టత ఇవ్వకపోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితికి దారితీస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రూ.2,400 మద్దతు ధర ప్రకారం మొక్కజొన్న కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వడ్లమూడిలోని సంగం డెయిరీలో (Sangam Dairy) భారీగా మొక్కజొన్న నిల్వలు అక్రమంగా ఉంచి, తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జోక్యం చేసుకుని విచారణ జరిపించాలని, రైతులకు నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ(TDP) ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై (Dhulipalla Narendra) కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ, అక్రమ కొనుగోళ్ల వెనుక దళారీల వ్యవస్థ పనిచేస్తోందని అన్నారు.
ఈ వ్యాఖ్యల తర్వాత మామిళ్లపల్లి గ్రామంలో రైతులు గోదాముల్లో నిల్వ ఉంచుకున్న మొక్కజొన్నను అంబటి మురళీకృష్ణకు చెందినదిగా ప్రచారం చేస్తూ, టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతుల గోదాములపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారని, అసత్య ప్రచారాలతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతులపై జరిగిన ఈ దాడులను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే అనుచరులు రైతుల ఇళ్లు, గోదాములు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని, ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. మామిళ్లపల్లి ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని, అధికార దుర్వినియోగానికి ఇది నిదర్శనమని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు.
ఇక “చలో మామిళ్లపల్లి”(“Chalo Mamillapalli”) కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ప్రకటించడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రైతులపై దాడి చేసిన ఘటనలో బండ్లమూడి బాబూరావుతో పాటు 31 మంది టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. తాజాగా బాధిత రైతులు తాడేపల్లిలో వైఎస్ జగన్ ని(YS Jagan) కలిసి తమ గోడౌన్లపై జరిగిన దాడులు, విధ్వంసం గురించి వివరించి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులపై రాజకీయ కక్షసాధింపుల పేరుతో దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని పలు రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొక్కజొన్న కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావాలని, రైతుల భద్రతను ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్లు బలపడుతున్నాయి.






