ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వ (Coalition Government) హయాంలో విద్యాశాఖలో(Education Department) జరుగుతున్న అవకతవకలపై వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, ప్రతిపక్ష నేత జగన్ (YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో స్పందించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై (Mega DSC) అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఇది “మెగా డీఎస్సీనా లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?” అని ప్రశ్నించారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా గల్లంతైందని ఆరోపించిన జగన్, పేపర్ లీకులు(Paper Leaks), డేటా డిలీట్(Data Delete), మెరిట్ లిస్టుల మాయం (Missing Merit Lists) వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి, కావాలనే ఆలస్యం చేసి, తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ప్రచారం కోసం వాడుకున్నారని విమర్శించారు.
అంతేకాకుండా, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శాఖలో “డార్క్ ఆపరేషన్”(Dark Operation) నడిచిందని ఆరోపిస్తూ, పరీక్షల నిర్వహణలో పాల్గొన్న ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికే (Outsourcing Employee) మొదటి ర్యాంక్ రావడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఆ తరువాత టాపర్ వివరాలు, మెరిట్ లిస్టులను డేటాబేస్ నుంచి తొలగించడం ఎందుకని నిలదీశారు.
ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే నేరుగా మెసేజ్‌లు పంపడం, కలెక్టర్ కార్యాలయాల్లో జాబితాలు ప్రదర్శించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని, ఫేక్ సర్టిఫికెట్లతో అర్హతలేని వారికి అవకాశాలు కల్పించారన్న ఆరోపణలు కూడా చేశారు.
టెట్ కన్వీనర్‌ను అకస్మాత్తుగా తొలగించి, మరో అధికారిని డీఎస్సీ కన్వీనర్‌గా నియమించడం వెనుక అసలు కారణం ఏమిటని ప్రశ్నించిన జగన్, “మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి”కి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిజమైన ప్రతిభ కలిగిన ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






