ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ తర్వాత చట్టంలో లేదనే కారణంతో ఆ హామీని అమలు చేయలేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గుర్తు చేశారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
విపక్షాలపై ఆయుధంగా డీలిమిటేషన్ వాడొద్దు
డీలిమిటేషన్‌ను ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా ఉపయోగించవద్దని మిథున్ రెడ్డి అన్నారు. దేశ నిర్మాణానికి ఉపయోగపడేలా ఈ ప్రక్రియ ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
ఏపీలో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సీట్లను సమానంగా కేటాయించాలని తెలిపారు. అప్పుడే డీలిమిటేషన్‌కు నిజమైన సార్థకత ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల్లో అసమానతలు ఉంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
డీలిమిటేషన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి నష్టం జరిగినా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.






