ప్రకాశం జిల్లా (Prakasam District) ఒంగోలులో (Ongole) హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గద్దలగుంట ప్రాంతంలో కన్నతల్లి అన్న భావన లేకుండా ఓ కుమారుడు అమానుషంగా ప్రవర్తించి, తన తల్లిని (Mother) సజీవ దహనం చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికుల సమాచారం ప్రకారం కొంతకాలంగా తల్లి కుమారుడి (Son) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం చిన్నపాటి వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆవేశానికి లోనైన కుమారుడు తల్లిని గదిలో బంధించి బయట నుంచి తలుపులు వేసి నిప్పు అంటించాడు. మంటలు క్షణాల్లో ఇంటంతా వ్యాపించడంతో లోపల ఉన్న వృద్ధురాలు బయటకు రావడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు.
కాపాడమని ఆమె అరుస్తున్నా ఎవరూ చేరుకోలేకపోయారు. చూస్తుండగానే మంటలు మరింత పెరిగి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంటి నుంచి పొగలు, మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వారు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే వృద్ధురాలు కాలిపోయి మృతదేహంగా మారింది.
పోలీసులు వెంటనే చేరుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్తి వివాదాలే ఈ ఘటనకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నారు.






