భారత్-పాకిస్థాన్(India-Pakistan) మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా వెల్లడించింది. ఈ సైనిక చర్యలో భారత సాయుధ దళాలకు చెందిన మొత్తం 6 మంది జవాన్లు వీరమరణం పొందినట్లు కేంద్రం ప్రకటించింది. ఇంతకాలం వారి వివరాలను గోప్యంగా ఉంచిన ప్రభుత్వం, తాజాగా వారి పేర్లను జాతీయ గౌరవ పట్టికలో (National Honour Roll) చేర్చడం ద్వారా దేశం కోసం చేసిన త్యాగాన్ని అధికారికంగా గుర్తించింది.
వీరమరణం (Martyrdom) పొందిన వారిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్(Pawan Kumar), రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్ (Sunil Kumar) వీర చక్ర, లాన్స్ నాయక్ దినేష్ కుమార్(Dinesh Kumar), హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (Sunil Kumar Singh) భారత సైన్యానికి చెందినవారు కాగా, ఏవియేషన్ టెక్నీషియన్ మూడ్ మురళీనాయక్(Mood Murali Nayak), సార్జెంట్ సురేంద్ర కుమార్ (Surendra Kumar) భారత వైమానిక దళానికి చెందినవారు. వీరు దేశ రక్షణ కోసం అత్యంత సాహసోపేతంగా పోరాడుతూ ప్రాణాలను అర్పించారు.
దేశం కోసం అమరులైన ఈ 6 మంది సైనికుల పేర్లను ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని 3డీ గౌరవ గోడపై చెక్కించడంతో పాటు, జాతీయ యుద్ధ స్మారక వెబ్‌సైట్‌లోని గౌరవ పట్టికలో కూడా నమోదు చేశారు. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ ముగిసి చాలా కాలం గడిచినప్పటికీ ఇప్పటివరకు ఈ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. తాజాగా వారి వివరాలను ప్రకటించడం ద్వారా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల జాబితాలో వారిని అధికారికంగా చేర్చినట్లైంది.
గతంలో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆ దాడికి ప్రతిస్పందనగా మే 7న భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. ఈ సైనిక చర్యలో భారత దళాలు అత్యంత వ్యూహాత్మకంగా, ధైర్యసాహసాలతో పోరాడి పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన ఈ వీర సైనికుల త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.








