---Advertisement---

నేడే పాడేరు మోదకొండమ్మ అమ్మవారి పుట్టిన రోజు – ప్రభుత్వం ఉత్సవాల తేదీ మార్పుతో గిరిజనుల్లో అసహనం.

May 12, 2026

---Advertisement---

గిరిజనుల (Tribals) ఆరాధ్య దైవంగా భావించే పాడేరు (Paderu) మోదకొండమ్మ (Modakondamma) అమ్మవారి పుట్టిన రోజు పండుగను నేడు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం మొత్తం రంగురంగుల అలంకరణలతో కళకళలాడుతుండగా, అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక రంగుల అలంకరణ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం అన్నసంతర్పణ, సాయంత్రం పల్లకి సేవ, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.

సాయంత్రం పట్టణ వీధుల్లో అమ్మవారి విగ్రహానికి పల్లకి సేవ నిర్వహించనుండగా, అనంతరం తిరిగి ఆలయంలో కొలువుదీర్చనున్నారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే, ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు మోదకొండమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అసలు మే 10, 11, 12 తేదీల్లోనే అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు జరగాల్సి ఉండగా, అకస్మాత్తుగా తేదీల మార్పు గిరిజన ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉత్సవాలు (Modakondamma Celebrations) నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

కానీ ఏప్రిల్ 15న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhyarani) సమక్షంలో ఉత్సవాలను మే 17, 18, 19 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పోలీసు బలగాలు అందుబాటులో లేవనే కారణాన్ని అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో మే 13న పాడేరు ప్రాంతంలో రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ (Kidari Sravan Kumar) వివాహం జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల తేదీల మార్పు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పందిరి రాట వేసి, ముహూర్తం ఖరారు చేసిన తర్వాత తేదీలు మార్చడంపై నాడే గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మంత్రి సమక్షంలోనే ఒక గిరిజన మహిళ తన అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ, ఆమెతో మంత్రి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై స్పందించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఉత్సవాల తేదీల మార్పు ఆచారాలకు విరుద్ధమని, దేవత ఆగ్రహానికి కారణమవుతుందని వ్యాఖ్యానించారు. గిరిజనుల విశ్వాసాలు, సంప్రదాయాలను పక్కనపెట్టి తీసుకున్న నిర్ణయం ప్రాంతీయ భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆయన హెచ్చరించారు. అయినా ప్రభుత్వం వెనకడుగు వేయకపోవడమపై గిరిజనులు నాడే తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment