భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నాయకులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. అయితే నేటి రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో తీరు కనిపిస్తోందన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యవహార శైలిపై ఇటీవలి కాలంలో రాజకీయ వర్గాల్లో(Political Circles), ప్రజాస్వామ్యవాదుల్లో (Democrats) పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన అనేక అంశాలపైనే ఇప్పుడు అధికారంలో ఉండగా భిన్నంగా స్పందిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రుషికొండ నిర్మాణాలు (Rushikonda Constructions), ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ (Road Expansion), పరిశ్రమల కాలుష్యం(Industrial Pollution), మహిళల భద్రత (Women Safety) వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అప్పట్లో ప్రభుత్వ చర్యలను వక్రీకరించి ప్రజా వ్యతిరేక చర్యలుగా చిత్రీకరిస్తూ ఉద్యమాల తరహాలో స్పందించిన ఆయన, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత అదే తరహా ఘటనలపై మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ సందర్భంగా అధికారులు డ్రైనేజీ, రహదారి విస్తరణ కోసం ఆక్రమణల తొలగింపులు చేపట్టినప్పుడు, జగన్ ప్రభుత్వం (Jagan Government) కక్షపూరితంగా ఇళ్లను కూల్చేస్తోందని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కోర్టు అధికారుల చర్యలను సమర్థించిన తర్వాత ఆ విమర్శలు రాజకీయ హడావుడిగానే మిగిలిపోయాయని అప్పట్లో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు విజయవాడ భవానీపురం జోజినగర్ ప్రాంతంలో సుప్రీంకోర్టు (Supreme Court) సూచనలు ఉన్నప్పటికీ ప్లాట్లు కూల్చివేత జరిగిన వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి ఉదాహరణగా ప్రతిపక్షాలు చూపిస్తున్నాయి.
అదేవిధంగా అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) కాలుష్య వ్యవహారంలోనూ (Pollution Issue) ఇదే తీరును విమర్శకులు గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు జారీ చేస్తే పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని పవన్ ఆరోపించారు. కానీ ఇప్పుడు గోదావరి కాలుష్యంపై (Godavari Pollution) మాట్లాడుతూ పరిశ్రమలు పర్యావరణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ హెచ్చరించడం రాజకీయ చర్చకు దారితీసింది. “అప్పుడు పరిశ్రమల పరిరక్షణ, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ” అనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
రుషికొండ వ్యవహారం కూడా మళ్లీ చర్చకు వచ్చింది. అప్పట్లో రుషికొండపై నిర్మాణాలను ప్రకృతి విధ్వంసంగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు విశాఖ పరిసర ప్రాంతాల్లో కొండలను తొలగిస్తూ జరుగుతున్న నిర్మాణాలపై స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పర్యావరణం విషయంలో అప్పటి వ్యాఖ్యలు, ఇప్పటి మౌనం పరస్పర విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల భద్రత అంశంలోనూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో మహిళలపై ఎక్కడ ఘటన జరిగినా తీవ్రస్థాయిలో స్పందించిన ఆయన, ఇప్పుడు అధికారంలో ఉండగా జనసేన (Jana Sena) నాయకులపై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం స్పందించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహిళలపై దాడులు, వేధింపుల ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో కూడా పార్టీ స్థాయిలో కఠిన చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.
కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఘటనల విషయంలోనూ ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన కార్యకర్త మద్యం మత్తులో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటే గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే(YSRCP MLA) అన్నా రాంబాబుపై (Anna Rambabu) నెపం నెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు జనసేన కార్యకర్తలు టీడీపీ వర్గీయుల నుండి హత్యలు, ఆత్మహత్యలు, వేధింపుల ఆరోపణలపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రచార రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తరచూ వివాదాస్పదమయ్యాయి. వాలంటీర్ వ్యవస్థపై (Volunteer System) చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ (Human Trafficking) ఆరోపణలు, పాకిస్తాన్ యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు, కేంద్ర నిఘా వర్గాల పేరుతో చేసిన ప్రకటనలు అప్పట్లో జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు జనసేన నుండే మీడియా, ప్రొఫెసర్లు, జర్నలిస్టులపై కేసులు, ఒత్తిళ్లు పెరుగుతున్నాయనే ఆరోపణలు రావడం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది.
సుగాలి ప్రీతి కేసులోనూ (Sugali Preethi Case) ఇదే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుటుంబానికి పూర్తి న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులే మీడియా ముందుకు రావడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
ఈ పరిణామాలన్నింటిని కలిపి చూస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించడం, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించడం ప్రతి నాయకుడి బాధ్యత అని ప్రజాస్వామ్యవాదులు గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ప్రశ్నించే స్వరాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.






