ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగిందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఆయన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షలు మరియు ఎం.ఆర్.ఐ. నివేదికల ఆధారంగా వైద్యులు శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు.
వైద్యుల ప్రకారం, ఆయన కనీసం వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం మాత్రమే తిరిగి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని సూచించారు. అంతేకాకుండా, పూర్తి స్వస్థతకు చేరుకోవడానికి దీర్ఘకాలిక జాగ్రత్తలు అవసరమని కూడా పేర్కొన్నారు.
ఇదే సమయంలో, ఫిబ్రవరి 2025లో జరిగిన కేబినెట్ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడానికి జ్వరం మరియు స్పాండిలైటిస్ కారణమని వెల్లడించబడింది. దాదాపు దశాబ్దకాలంగా పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసిన ఈ పరిస్థితి ప్రస్తుతం మరింత తీవ్రతకు దారితీసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ జ్వరానికి గురవుతున్నారనే సమాచారం కూడా కూటమి వర్గాల్లో ఆందోళనను పెంచుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితి పట్ల అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా, తరచూ అనారోగ్య సమస్యలు రావడం వల్ల శాఖాపరమైన పనుల నిర్వహణ ఆలశ్యం పై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.





