ఆంధ్రప్రదేశ్‌లోని Andhra Pradesh) చిత్తూరు(Chittoor), శ్రీకాకుళం (Srikakulam) జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల సమస్య ఎన్నో ఏళ్లుగా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేయడం, గ్రామాల్లోకి దూసుకురావడం, అమాయకుల ప్రాణాలు బలితీసుకోవడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు గత ప్రభుత్వాలు కూడా కుంకీ ఏనుగులతో “ఆపరేషన్ గజ”(Operation Gaja) పేరుతో చర్యలు చేపట్టాయి. అయితే అప్పట్లో ఈ ఆపరేషన్లకు పెద్దగా ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా కొనసాగేవి.
కానీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు అటవీశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. అటవీశాఖ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కొన్ని మీడియా సంస్థలు, జనసేన (Jana Sena) సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ప్రారంభించాయి. ఇదే సమయంలో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల దాడులు మరింత పెరగడంతో పాటు, పూతలపట్టు నాగంవాండ్లపల్లిలో రైతు గణపతి యాదవ్ మరణం వంటి ఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఈ విమర్శల నడుమ పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో (Karnataka Government) మాట్లాడి కొత్త కుంకీ ఏనుగులను (Kumki Elephants) ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనకు భారీ ప్రచారం లభించింది. చివరకు 2025 మేలో కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను ఏపీకి అప్పగించింది. బెంగళూరులోని (Bengaluru) విధానసౌధ వద్ద జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్(DK Shivakumar), అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే (Eshwar Khandre) సమక్షంలో ఈ ఏనుగులను అధికారికంగా అప్పగించారు. పవన్ కళ్యాణ్‌కు ఒప్పంద పత్రాలు అందజేయగా, గజపూజలతో వీటిని ఘనంగా సాగనంపారు.
ఈ ఘటనను కొన్ని తెలుగు మీడియా సంస్థలు, జనసేన సోషల్ మీడియా చారిత్రాత్మక ఘట్టంలా చూపించాయి. ఏపీలో మొదటిసారి కుంకీ ఏనుగులు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితులు కొన్ని రోజుల తరువాత బయటకు రావడంతో వివాదం మొదలైంది.
పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ఏనుగుల పేర్లు దేవా(Deva), కృష్ణ(Krishna), అభిమన్యు(Abhimanyu), రంజన్(Ranjan). అయితే ఈ ఏనుగులు వచ్చిన కొద్ది రోజులకే పలమనేరు అటవి ప్రాంతంలో కుంకీ ఆపరేషన్ (Kumki Operation) నిర్వహించారు అటవీ అధికారులు. జనసేన సోషల్ మీడియాలో “కుంకీ ఆపరేషన్ విజయవంతం” అంటూ ప్రచారం చేసి, ఆ ఆపరేషన్ నిర్వహించిన ఏనుగులు పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి తెచ్చినవేనంటూ క్యాంపెయిన్ చేశారు. అయితే ఫోటోలు, వార్తల్లో కనిపించిన ఏనుగుల్లో గతంలోనే ఉన్న జయంత్, వినాయక్ ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు ఏనుగులు దశాబ్ద కాలంగా రాష్ట్రంలో సేవలందిస్తున్న పాత కుంకీ ఏనుగులే. అవి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఏనుగులకు సంబంధం లేదని తేలింది.
ఇక పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఏనుగులు కుంకీ ఆపరేషన్లకు పూర్తిగా పనికిరావన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణ, అభిమన్యు అనే రెండు ఏనుగులు చిన్నవిగా ఉండటంతో ఫ్రంట్‌లైన్ ఆపరేషన్లకు పూర్తిగా ఉపయోగపడవని అధికారులు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రంజన్ అనే ఏనుగు ప్రవర్తన నియంత్రణలో ఉండదని, దాని వద్దకు వెళ్లినా ఆగ్రహంగా మారుతుందని, దానిని తీసుకొచ్చిన కర్ణాటక మావటివాళ్లు కూడా తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు.
అత్యంత వివాదాస్పదంగా మారింది దేవా అనే ఏనుగు అంశం. దీనికి ఒక కన్ను కనిపించదని, ఆ స్థితిలోనే ఏపీకి తీసుకొచ్చారని అటవీశాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో “గుడ్డి ఏనుగు”(Blind Elephant) అంశం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఏనుగుల పనితీరుపై ప్రశ్నలు మొదలయ్యాయి.
తాజాగా ఈ నాలుగు ఏనుగుల నిర్వహణ ఖర్చులు రాష్ట్రానికి భారంగా మారాయని, వాటిలో కొన్ని ఆపరేషన్లకు పనికిరావని అటవీశాఖ అధికారులు భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా దేవా అనే ఏనుగును తిరిగి కర్ణాటకకు పంపించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
దీంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన కుంకీ ఆపరేషన్ పూర్తిగా విఫలమైందా? ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న జయంత్, వినాయక్ వంటి పాత కుంకీ ఏనుగులే ఇప్పటికీ అసలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయా? కర్ణాటక ప్రభుత్వం పనికిరాని ఏనుగులను తెలివిగా ఏపీకి అప్పగించిందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీస్తున్నాయి.






