రాష్ట్రంలో ఉన్నత విద్య రంగంలో (Higher Education) కీలక మార్పులకు దారితీసే ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం-2016 (Private University Act-2016) సవరణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సవరణల వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ యూనివర్సిటీ (Private University) స్థాపనకు ఉన్న కఠిన నిబంధనలను ప్రభుత్వం భారీగా సడలించింది. 50 ఎకరాల స్థలం అవసరాన్ని 10 ఎకరాలకు తగ్గించడం, రూ.15 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను (Fixed Deposit) రూ.5 కోట్లకు కుదించడం, రూ.250 కోట్ల అభివృద్ధి నిబంధనను పూర్తిగా ఎత్తివేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది.
ఈ మార్పులతో ఇప్పటికే ఉన్న ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంగా ప్రస్తుతం ఉన్న కన్వీనర్ కోటా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి నెలకొంది. కళాశాలల్లో 70 శాతం ఉన్న కన్వీనర్ కోటా, యూనివర్సిటీగా మారిన తర్వాత కేవలం 30 శాతానికి తగ్గిపోవడం వల్ల పేద విద్యార్థుల ప్రవేశ అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. వాస్తవానికి వైసిపి ప్రభుత్వం (YCP Government) 30 శాతం కన్వీనర్ కోటాను కొత్తగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రైవేట్ యూనివర్సిటీల్లో కొంతమేర పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కలిగింది.
ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) పథకం కూడా ప్రధానంగా కన్వీనర్ కోటాకే (Convenor Quota) పరిమితం కావడంతో, ఈ కోటా తగ్గితే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్య కోర్సులకు దూరమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటం విద్యార్థులపై మరింత భారంగా మారింది.
ఇదిలా ఉండగా, పలువురు సామాజిక వేత్తలు ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల పెరుగుదలతో విద్యా వ్యవస్థ వాణిజ్యీకరణ దిశగా వెళ్లిపోతుందని, ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. ఫీజుల భారం, అక్రమ వసూళ్లపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో మరిన్ని సడలింపులు ఇవ్వడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు పేద విద్యార్థుల ఆశలను మరింత దెబ్బతీస్తాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.






