వైయసార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి (Pudi Srihari) అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పరిపాలనపై విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారనే ఆరోపణలతో కుప్పం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అరెస్ట్ చేసిన తర్వాత 33 గంటల పాటు కోర్టులో హాజరు పరచకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇదిలా ఉండగా, వైద్య పరీక్షలు పూర్తి అయినప్పటికీ కోర్టుకు హాజరు చేయడంలో జాప్యం జరగడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో చివరికి పోలీసులు పూడి శ్రీహరిని కుప్పం కోర్టులో(Kuppam Court) హాజరుపరిచారు. కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ (Bail) మంజూరు చేయడం మరో కీలక పరిణామంగా మారింది.
బెయిల్ అనంతరం మీడియాతో మాట్లాడిన పూడి శ్రీహరి, జర్నలిస్టులను ఈ విధంగా వేధించడం తగదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన తమలాంటి వారిని ఎదగనివ్వకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. దశాబ్దాలకు ఒకసారి మాత్రమే తమలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించే నాయకులు వస్తారని, అలాంటి సమయంలో ఇలాంటి వేధింపులు ఎదురవ్వడం విచారకరమని అన్నారు.
తాను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఉన్నానని, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నాయకత్వంలో నడవడం తనకు మరింత బలం ఇచ్చిందని పేర్కొన్నారు. జగన్ సమక్షంలో ఉండటం ద్వారా ధైర్యం లేని వారికి ధైర్యం వస్తుందని, ధైర్యం ఉన్నవారికి మరింత ఉత్సాహం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







