---Advertisement---

‘సేవ్ పునర్విక’ మానవతా ఉద్యమం సక్సెస్

April 19, 2026

---Advertisement---

కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన మంగలి సురేష్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికశ్రీ పుట్టుకతోనే ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్–1’ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి వల్ల చిన్నారి కదలలేని స్థితిలో ఉండటమే కాకుండా, ఏడవడం, నవ్వడం, ఊపిరి తీసుకోవడం వంటి సాధారణ చర్యలకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వైద్యులు స్పష్టం చేసినట్లు, రెండేళ్లలోపు రూ.16 కోట్ల విలువైన ‘జోల్ జెన్స్‌స్మా’ ఇంజెక్షన్ అందిస్తేనే చిన్నారి సాధారణ జీవితం వైపు పయనించే అవకాశం ఉందని తేలింది.

సాధారణ బార్బర్‌గా జీవనం సాగించే సురేష్‌కు ఈ భారీ మొత్తం సమకూర్చడం అసాధ్యంగా మారడంతో, డిసెంబర్ 2025లో తన కుమార్తెను కాపాడాలని భావోద్వేగ పూర్వకంగా ప్రజలను అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తి మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వ్యాపించి, ‘సేవ్ పునర్విక’ అనే పేరుతో ఒక విశాలమైన మానవతా ఉద్యమంగా మారింది. యువత సైకిల్ ర్యాలీలు నిర్వహించడం, ఆటో డ్రైవర్లు తమ వంతు సహాయం అందించడం, చిన్నారులు తమ పొదుపు మొత్తాలను విరాళంగా ఇవ్వడం వంటి సంఘటనలు సమాజంలో ఉన్న దయా గుణాన్ని ప్రతిబింబించాయి. సామర్లకోటకు చెందిన ఒక యువకుడు 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టి అవగాహన కల్పించడం విశేషం. ఈ సమిష్టి కృషితో కేవలం మూడు నెలల్లోనే దాదాపు రూ.10 కోట్లు సేకరించబడింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి, యూఎస్ఏ నుండి దిగుమతి చేయాల్సిన ఈ ఖరీదైన ఇంజెక్షన్‌పై సుమారు రూ.6 కోట్ల దిగుమతి సుంకాన్ని మినహాయించింది. అదనంగా కేంద్ర ఆరోగ్య శాఖ రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ నేపధ్యంలో దాతల సమీకరణల ద్వారా అలాగే ప్రత్యక్షంగా తన అకౌంట్ కు వచ్చిన మొత్తం రూ.9 కోట్లకు మించిపోయిందని. దీంతో త్వరలో పాపకు చికిత్స ప్రారంభం కానుందని. ఆర్థిక సహాయం చేసిన వారందరికి కృతజ్ఞతలని. ఇకపై విరాళాలు వద్దని. పాప తండ్రి గత ఫిబ్రవరి నెలలో ప్రకటించారు.

తదనంతరం సేకరించిన నిధులతో ఇంజెక్షన్‌ను తెప్పించి, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో డాక్టర్ రమేష్ కోనంకి పర్యవేక్షణలో పునర్వికకు విజయవంతంగా ఇంజెక్షన్ అందించారు. ఇంజెక్షన్ అనంతరం చిన్నారి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా, మరికొన్ని రోజులు చికిత్స కొనసాగనుంది. అయితే మంత్రి లోకేష్ సైతం పాప వైధ్యానికి సహాయం అందించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా దీనిపై స్పష్టత లేదు. ఈ ఘటన సమాజంలో మానవతా భావం, సమిష్టి సహకారం, మరియు సాంకేతిక వైద్య పురోగతులు కలిసివస్తే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుందనే విషయాన్ని స్పష్టంగా చాటింది.

ఇదే తరహాలో గతంలో కూడా అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు జగన్ ప్రభుత్వ సహాయం అందిన ఉదాహరణలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన డయానా శాంతి అనే చిన్నారికి కూడా ఇదే వ్యాధి సోకగా, ఆమె చికిత్స కోసం అవసరమైన రూ.16 కోట్లను అప్పటి జగన్ ప్రభుత్వం మంజూరు చేయడం విశేషం. అదనంగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం మరియు నెలవారీ 5000 పెన్షన్ అందించడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment