నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల (Students) ఆందోళనలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి వారికి అండగా నిలిచారు. శనివారం జంతర్ మంతర్‌కు (Jantar Mantar) వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ నిరసన చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌లు(Lathi Charges), దాడులను తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వంపై (Central Government) మండిపడ్డారు.
ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, వారి కాళ్లు, తలలపై దాడులు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన అధికారులు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడినందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ యువతకు వెంటనే క్షమాపణ (Apology) చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులు చేస్తున్న 3 ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను (Dharmendra Pradhan) వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనను మరో శాఖకు బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోందని, అలాంటి నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి(Corruption), విద్యా వ్యవస్థ (Education System) వైఫల్యానికి ప్రతీకగా మారారని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన వ్యక్తిని మరో శాఖకు మార్చడం కాదు, నేరుగా పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.







