ఎన్నో రోజులుగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడి పాత్రలో, దర్శకుడు నితేష్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ (Ramayana) ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గురువారం బ్రహ్మముహూర్తమైన ఉదయం 4:15 గంటలకు మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విడుదలైన క్షణాల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, విజువల్స్ చూసిన ప్రేక్షకులు మూవీ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ట్రైలర్ మొత్తం అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించారు. భారతీయ పురాణ కావ్యానికి అత్యాధునిక సాంకేతికతను జోడించి ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో వైభవంగా తీర్చిదిద్దారు. గతంలో నటీనటుల ఎంపికపై వచ్చిన విమర్శలకు ఈ ట్రైలర్‌తోనే మేకర్స్ గట్టి సమాధానం ఇచ్చినట్లైంది. ప్రారంభంలోనే రావణాసురుడి పాత్రలో యశ్ (Yash) పవర్‌ఫుల్ లుక్ ఆకట్టుకోగా, దశాననుడి రూపాన్ని హుందాగా, సహజంగా ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శ్రీరాముడిగా (Lord Rama) రణబీర్ కపూర్ స్క్రీన్‌పై కనిపించిన ప్రతి సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటోంది. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) తన అమాయకత్వం, సాత్వికత, భావోద్వేగ నటనతో ప్రత్యేకంగా మెప్పించింది. ఆమె ఎంపికపై గతంలో వచ్చిన విమర్శలకు ఈ ట్రైలర్ సరైన సమాధానంగా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, కైకేయిగా లారా దత్తా కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినట్లు ట్రైలర్‌లో స్పష్టమైంది.
ఇక అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరింత ప్రాణం పోసింది. గతంలో విడుదలైన టీజర్‌తో నిరాశ చెందిన అభిమానులకు ఈసారి దర్శకుడు నితేష్ తివారీ ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా రూపొందింది. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామాయణం’ భారతీయ సినీ చరిత్రలో మరో అరుదైన మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.






