---Advertisement---

రెడ్ బుక్ పేజీల్లో ఇప్పుడు నీతి వాఖ్యాల చాప్టరా?

April 13, 2026

---Advertisement---

తెలుగుదేశం (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారు కూటమి కట్టి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో హింసా సంస్కృతికి (Culture of Violence) తెరలేపారనేది నిర్వివాదాంశం. ప్రత్యర్థి పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలు, వారి ఆస్తులపై దాడులు ఏ స్థాయిలో జరిగాయో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం సాక్ష్యంగా నిలిచింది. దాడులు, బెదిరింపులు మాత్రమే కాకుండా, అనేక మందిపై హత్యాయత్నాలు చేయడం, హత్యలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా హింస కూటమి గెలిచిన తర్వాత రాష్ట్రంలో చెలరేగింది.

అయితే ఈ హింసా రాజకీయానికి ప్రాణం పోసింది చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్(Nara Lokesh)తీసుకువచ్చిన “రెడ్ బుక్” (Red Book) సంస్కృతేనని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatra) ఉన్న సమయంలో ఆయన పదేపదే “తాము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ ప్రకారం పరిపాలన చేస్తాం” అని, తమ దారికి అడ్డుగా ఉన్న వారి పేర్లను అందులో నమోదు చేసుకున్నామని, వారిని బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై నడిపిస్తామని హెచ్చరిస్తూ వచ్చారు. ఆ వ్యాఖ్యలు వారి క్యాడర్‌ను ప్రభావితం చేసి, గెలిచిన వెంటనే దాడులు జరిపి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించారు. అనుభవం ఉన్న చంద్రబాబు సైతం “మిజరబుల్ ట్రీట్‌మెంట్ (Miserable Treatment) ఇస్తాం” వంటి వ్యాఖ్యలు చేయడం వారి క్యాడర్‌లో హింసా సంస్కృతిని మరింత ప్రేరేపించిందని కాదనలేని సత్యం.

తెలుగుదేశం 2014–19 మధ్య పాలనలో వైసీపీకి(YSRCP) చెందిన చెలుకులపాటి నారాయణ రెడ్డి వంటి సీనియర్ నాయకులను హత్య చేయడంతో పాటు, అనేక మంది గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులను కూడా హతమార్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే నాడు జగన్ (Y. S. Jagan Mohan Reddy) “మిజరబుల్ ట్రీట్‌మెంట్ ఇస్తాం” అని ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రత్యర్థులపై దాడులు జరగకుండా కట్టడి చేశారు. వాస్తవానికి ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే తీసుకున్న మొదటి నిర్ణయం పరిటాల కుటుంబానికి భద్రత పెంచడం. అయితే ఆయన పాలనలో ప్రభుత్వంతో సంబంధం లేని కొన్ని ఘటనలను రాజకీయ ప్రేరిత ఘటనలుగా చిత్రీకరించి, తెలుగుదేశం తమ కార్యకర్తలను మళ్లీ చైతన్యపరిచే ప్రయత్నం చేసిందనేది రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ విదితమే.

అయితే వారి వ్యూహం అప్పటికి సత్ఫలితాలు ఇచ్చినా, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రాష్ట్రంలో హింసా నాట్యం కొనసాగింది. ఫలితంగా ఆస్తుల ధ్వంసం, హత్యలు, దాడులు, బెదిరింపులు, అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగింది. ఒక్క గురజాలలోనే 18 నెలల్లో 7 రాజకీయ హత్యలు జరిగాయని కాసు మహేష్(Mahesh) వంటి నాయకులు చెబుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ “రెడ్ బుక్” విధానం వైసీపీ కార్యకర్తలనే కాకుండా నాయకులపై కూడా ప్రయోగించబడింది. అందులో భాగంగా ఏపీలో ఎప్పుడూ లేని విధంగా సీనియర్ నాయకుల ఇళ్లపై దాడులు, గృహ దహనాలు జరిగాయి. టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై జరిగిన దాడుల్లో అంబటి రాంబాబు, జోగి రమేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పెర్నీ నాని, ముద్రగడ, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కామిరెడ్డి నాని, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బయ్ చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరుల ఇళ్లపై దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే హిందూపూర్ వైసీపీ కార్యాలయం, దాడిశెట్టి రాజా, ఉప్పల హారిక, ఉప్పల రాము, దేవినేని అవినాష్‌పై దాడి యత్నం, చిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి, మార్గాని భరత్ కార్యాలయం, విడదల రజిని పై దాడి యత్నం, రోజాపై దూషణలు, నంబూరి శంకరరావు కార్యాలయం, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడులు జరిగినట్లు ఆరోపించబడింది. అదేవిధంగా డెక్కన్ క్రానికల్, సాక్షి కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయని పేర్కొంటున్నారు.

వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, నారా లోకేష్ సభల్లో “రెడ్ బుక్”ను ప్రశంసించడం, “రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తుంది” అని వ్యాఖ్యానించడం, “ఇంకా చాలా పేజీలు ఉన్నాయి” అని హెచ్చరించడం వంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ సంస్కృతి మానుకోవాలని జగన్ హెచ్చరించినప్పటికీ, అవి పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్, ఈ అనైతిక చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని, అవసరమైతే ఎక్కడున్నా తీసుకువచ్చి శిక్షిస్తామని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు.

అయితే జగన్ చేసిన ఈ ప్రకటనలతో వైసీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే సమయంలో ఇటీవల టీడీపీ నాయకుల ప్రవర్తనను గమనిస్తే, “రెడ్ బుక్”లో ఇప్పుడు నీతి వాఖ్యాల పేజీ తెరవబడిందా అన్న అనుమానం కలుగుతోంది. గతంలో చేసిన చర్యల నేపథ్యంలో, ఇప్పుడు తాము శాంతి పరులమని చెప్పుకునే ప్రయత్నం ప్రజల్లో విమర్శలకు దారితీస్తోంది. ఈ సంస్కృతికి ఆరంభంలోనే అడ్డుకట్ట వేసి ఉంటే, నేడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉండేవి కావని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు సీనియారిటీ కూడా పుత్రోత్సాహం ముందు పలుచబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment