విశాఖపట్నం (Visakhapatnam) తీర అందాలకు ప్రతీకగా నిలిచే రుషికొండ (Rushikonda) చుట్టూ గత కొన్నేళ్లుగా సాగిన రాజకీయ, పర్యావరణ వివాదాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు రుషికొండపై నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, ఇప్పుడు అదే తరహా కొండ తవ్వకాలతో చేపడుతున్న యూనిటీ మాల్ నిర్మాణంపై మౌనం పాటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీంతో “రుషికొండకు ఒక నీతి.. యూనిటీ మాల్‌కు మరో నీతా?” అనే ప్రశ్న ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలో రుషికొండపై ఉన్న పాత హరితా రిసార్ట్స్‌ను (Haritha Resorts) తొలగించి, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణాలపై అప్పట్లో తెలుగుదేశం (TDP), జనసేన నేతలు (Jana Sena Party) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. “జగన్ ప్యాలెస్”(Jagan Palace), “రుషికొండకు గుండు” అంటూ విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్వయంగా అక్కడికి వెళ్లి నిరసన వ్యక్తం చేయగా, పలువురు నేతలు కోర్టులను కూడా ఆశ్రయించారు.
అయితే ఆ నిర్మాణాలకు సంబంధించి పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు ఉన్నాయని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. వాల్తా చట్టం ప్రకారం తొలగించిన చెట్లకు రెండింతలు చెట్లు నాటే నిబంధనలను కూడా పాటించినట్లు వివరించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (Alliance Government) కూడా అవి ప్రభుత్వ అవసరాల కోసమే నిర్మించబడిన భవనాలని అంగీకరించాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం వద్ద 172 కోట్ల రూపాయల వ్యయంతో “యూనిటీ మాల్”(Unity Mall) నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రామానాయుడు స్టూడియో సమీపంలోని కొండ వాలును తొలిచి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రుషికొండ నిర్మాణాలను పర్యావరణ విధ్వంసంగా అభివర్ణించిన వారు, ఇప్పుడు యూనిటీ మాల్ విషయంలో మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
నాడు ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని “ప్రకృతి నాశనం”గా (Nature Destruction) చిత్రీకరించిన మీడియా వర్గాలు, పర్యావరణ కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారంలో ఎవరు ఉన్నారన్న దాని ఆధారంగా పర్యావరణ ప్రమాణాలు మారుతున్నాయా? అనే ప్రశ్నలను రాజకీయ విశ్లేషకులు కూడా లేవనెత్తుతున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం పర్యావరణ అంశాలను ఆయుధాలుగా ఉపయోగించడం ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకే తరహా నిర్మాణాలపై అధికారాన్ని బట్టి వేర్వేరు ప్రమాణాలు అనుసరించడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకర ధోరణిగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రుషికొండ, యూనిటీ మాల్ వివాదాలు కేవలం నిర్మాణాల గురించే కాకుండా రాజకీయాల్లోని ద్వంద్వ వైఖరిపై కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.






