విద్యార్థులతో (Students) వెళ్తున్న స్కూల్ బస్సును(School Bus) వేగంగా దూసుకొచ్చిన రైలు (Train) ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్లోని (West Bengal) ముర్షిదాబాద్ (Murshidabad) సమీపంలో జరిగింది. కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ (Karnasubarna Railway Crossing) దాటుతున్న సమయంలో స్కూల్ బస్సును రైలు బలంగా ఢీకొట్టడంతో బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో 3 మంది విద్యార్థులు(Students) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 5 మంది విద్యార్థులు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు, సహాయక బృందాలు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఈ ప్రమాదానికి బాధ్యులుగా భావించిన రైల్వే గేట్ కీపర్ (Railway Gate Keeper), సూపర్వైజర్లను (Supervisors) ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ (Suspended) చేశారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికితీసే పనిలో ఉన్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







