బైజూస్ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్‌కు (Byju Raveendran) సింగపూర్ కోర్టు (Singapore Court) భారీ షాక్ ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన వివాదాల నేపథ్యంలో కోర్టు ఆదేశాలను పదేపదే ధిక్కరించినందుకు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించినట్లు అంతర్జాతీయ మీడియా (International Media) వెల్లడించింది. 2024 ఏప్రిల్ నుంచి తన ఆస్తుల వివరాల వెల్లడికి సంబంధించి జారీ చేసిన పలు ఉత్తర్వులను రవీంద్రన్ పట్టించుకోలేదని సింగపూర్ న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో వెంటనే అధికారులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదే కేసులో బైజూస్ అనుబంధ సంస్థల్లో వాటాలు కలిగి ఉన్న ‘బీఆర్ ఇన్వెస్ట్‌కో పీటీఈ’(BR Investco Pte Ltd) సంస్థపై తనకు ఉన్న యాజమాన్య హక్కులను నిరూపించే పత్రాలను సమర్పించాలని కోర్టు పేర్కొంది. అలాగే కోర్టు ఖర్చులు, జరిమానా నిమిత్తం 90,000 సింగపూర్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఇది భారత కరెన్సీలో సుమారు 70,500 అమెరికన్ డాలర్లకు సమానమని తెలుస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి (Qatar Investment Authority) చెందిన అనుబంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగానే ఈ సంచలన తీర్పు వెలువడింది.
ఈ తీర్పుపై స్పందించిన బైజూస్ రవీంద్రన్.. కోర్టు పరిణామాలను కొందరు కావాలనే తప్పుడు కోణంలో ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్వెస్టర్లతో సమగ్ర సెటిల్‌మెంట్ దిశగా చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. గత కొన్ని నెలలుగా పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగానే కోర్టు విచారణలకు హాజరు కాలేకపోయామని వివరించారు.
సెటిల్‌మెంట్ చర్చల్లో తాము ఎలాంటి తప్పు చేయలేదని ఇన్వెస్టర్లు కూడా ప్రాథమికంగా అంగీకరించినట్లు రవీంద్రన్ వెల్లడించారు. అయితే సెటిల్‌మెంట్ ప్రక్రియ కీలక దశకు చేరుకున్న సమయంలో ఒత్తిడి పెంచేందుకే ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఈ కేసును ముందుకు తీసుకెళ్తోందని బైజూస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.






