---Advertisement---

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌…!

July 30, 2026

Summarize with AI

---Advertisement---

సూపర్‌ స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరోగా జై కృష్ణ ఘట్టమనేని (Jai Krishna Ghattamaneni) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram). మహేశ్‌ బాబు సోదరుడు రమేశ్‌ బాబు కుమారుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన జై కృష్ణకు ఇది తొలి సినిమా. ‘మంగళవారం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించగా, బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ట్రైలర్‌, పాటలు మంచి హైప్‌ తీసుకురావడంతో జులై 30న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికి వస్తే..

తిరుపతిలో (Tirupati) పలుకుబడి, డబ్బు, పవర్‌తో అందరినీ భయపెట్టే వ్యక్తి పెద్దిరెడ్డి. ఆయన కుమార్తె మంగను (Manga) చూసిన మొదటి క్షణంలోనే శ్రీనివాస్‌ (Srinivas) ప్రేమలో పడతాడు. తిరుపతికి కొత్తగా వచ్చిన శ్రీనివాస్‌కు స్వతంత్ర బాబు పరిచయం అవుతాడు. మంగకు దగ్గరయ్యే ప్రయత్నంలో మొదట ఆమె పట్టించుకోకపోయినా, తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఇదే సమయంలో మంగకు మరో వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అయినప్పటికీ తన ప్రేమను శ్రీనివాస్‌ వదలడు. అతని అసలు నేపథ్యం ఏమిటి, తిరుపతికి ఎందుకు వచ్చాడు, వాసుబాబు ఎవరు, బళ్లారి డాన్‌ వెంకటప్పయ్యనాయుడితో ఉన్న సంబంధం ఏమిటి, చివరకు ఈ ప్రేమకథ ఎలా ముగిసింది అనేది తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే..

కృష్ణ కుటుంబం నుంచి హీరో వస్తున్నాడనే కారణంతో ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అజయ్‌ భూపతి కూడా బలమైన కథతో జై కృష్ణను పరిచయం చేస్తాడని చాలామంది భావించారు. కానీ దర్శకుడు పూర్తిగా కమర్షియల్‌ ఫార్ములాను నమ్ముకుని ముందుకు వెళ్లాడు. కొత్తదనం కంటే పాత తరహా కథను ఎంచుకోవడం సినిమా బలహీనతగా మారింది.

మొదటి భాగంలో హీరో, హీరోయిన్‌ పరిచయాలు, ప్రేమ సన్నివేశాలు చాలా వేగంగా సాగిపోతాయి. మొదటి 40 నిమిషాల్లోనే వరుసగా 3 పాటలు రావడం కథ వేగాన్ని తగ్గిస్తుంది. ప్రేమ సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. అయితే స్వతంత్ర బాబు పాత్రతో వచ్చే కామెడీ కొంత రిలీఫ్‌ ఇస్తుంది. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బోర్‌ కొట్టనివ్వవు. ఫస్ట్‌ హాఫ్‌ చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్‌తో రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది.

సెకండ్‌ హాఫ్‌లో మాత్రం కథ పూర్తిగా ఊహించిన దారిలోనే సాగుతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాలే మళ్లీ కనిపిస్తాయి. ప్రేమకథలో కొత్తదనం లేకపోవడం, ఎమోషన్స్‌ బలంగా కనెక్ట్‌ కాకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. క్లైమాక్స్‌ కూడా సాధారణంగానే ముగుస్తుంది. మొత్తంగా కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రయత్నించినా, బలమైన కథ లేకపోవడంతో సినిమా పూర్తిగా ప్రభావం చూపలేకపోయింది.

ఎవరెలా చేశారంటే..

తొలి సినిమానే అయినప్పటికీ జై కృష్ణ తెరపై మంచి కాన్ఫిడెన్స్‌తో కనిపించాడు. లుక్స్‌, యాక్షన్‌, డ్యాన్స్‌లలో ఆకట్టుకున్నాడు. అయితే భావోద్వేగ సన్నివేశాల్లో అనుభవలేమి కనిపించింది. మరికొన్ని సినిమాలు చేస్తే నటుడిగా మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. రాషా తడాని తన పాత్రకు న్యాయం చేసింది. స్క్రీన్‌పై అందంగా కనిపించడంతో పాటు పాత్రకు తగ్గట్టుగా నటించింది.

మోహన్‌ బాబు తక్కువ సమయం కనిపించినా తన అనుభవంతో ప్రత్యేక ముద్ర వేశారు. కిక్‌ శ్యామ్‌, నరేశ్‌, అజయ్‌, వాసుకి తదితరులు తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. ముఖ్యంగా స్వతంత్ర బాబు పాత్రలో వచ్చిన కామెడీ సినిమా మొత్తంలో కొంత వినోదాన్ని అందించింది.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. ‘అల్లల్లే’ పాట వినడానికి బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు మాత్రం మంచి స్థాయిలో ఉన్నాయి.

చివరిగా..

‘శ్రీనివాస మంగాపురం’లో కమర్షియల్‌ అంశాలు, యాక్షన్‌, పాటలు ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం, ప్రేమకథ బలహీనంగా ఉండడం సినిమాను సాధారణ స్థాయిలో నిలిపాయి. జై కృష్ణకు హీరోగా మంచి పరిచయ చిత్రం అయినా, ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక రొటీన్‌ కమర్షియల్‌ లవ్‌స్టోరీగానే అనిపిస్తుంది.

రేటింగ్‌: 2.5/5

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment