---Advertisement---

శ్రీవాణి ట్రస్టు వెనుక అసలు లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందా?

May 12, 2026

---Advertisement---

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టు గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలో హిందూ ధార్మిక కార్యక్రమాలకు కీలక వేదికగా మారింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ధూపదీప నైవేద్యాల నిర్వహణ, ధార్మిక ప్రచార కార్యక్రమాల ద్వారా ఈ ట్రస్టు ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అయితే ఇప్పుడు అదే శ్రీవాణి ట్రస్టు రాజకీయ ఆరోపణలు, వివాదాల కేంద్రబిందువుగా మారడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

శ్రీవాణి ట్రస్టు (Srivani Trust) ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మతాంతీకరణలను అడ్డుకునేందుకు సుమారు మూడు వేల ఆలయాల నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాములోనే శ్రీకారం చుట్టారు. వెనుకబడిన గ్రామాల్లో ఆలయ నిర్మాణాలు చేపట్టడం ద్వారా సామాజికంగా బలహీన వర్గాల్లో ధార్మిక చైతన్యం పెంచాలనే లక్ష్యాన్ని అప్పటి ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 2023 ఏప్రిల్ నాటికి 176 పురాతన ఆలయాల పునరుద్ధరణ పూర్తయింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 2,273 కొత్త ఆలయాలు నిర్మించబడ్డాయి. మరో 501 ఆలయాలకు ప్రతి నెల రూ.5 వేల చొప్పున ధూపదీప నైవేద్యాల కోసం నిధులు అందించారు.

2019 సెప్టెంబర్ 23న తీసుకున్న నిర్ణయం ప్రకారం శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేల విరాళం ఇచ్చిన భక్తులకు ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan) కల్పించే విధానాన్ని టీటీడీ(TTD) ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం తరువాతే ట్రస్టుకు భారీ స్థాయిలో విరాళాలు రావడం ప్రారంభమైంది. కేవలం 2023 మే 31 వరకు మాత్రమే భక్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా రూ.861 కోట్లకు పైగా విరాళాలు అందించారు.

ఈ ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారని అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వెల్లడించారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.93 కోట్లు మంజూరు చేయగా, వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల వ్యయంతో 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. వీటిలో 1,953 ఆలయాలను ఏపీ దేవాదాయ శాఖ(AP Endowments Department), మరో 320 ఆలయాలను సమరసత సేవా ఫౌండేషన్ నిర్మిస్తున్నట్లు నాడే ప్రకటించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించారు.

శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి వచ్చిన విరాళాల పెరుగుదల కూడా గమనార్హమే. 2019లో రెండు నెలల్లోనే రూ.26.25 కోట్లు విరాళాల రూపంలో లభించగా, 2020లో రూ.70.21 కోట్లు, 2021లో రూ.176 కోట్లు, 2022లో రూ.282.64 కోట్లు, 2023లో రూ.268.35 కోట్లు భక్తులు సమర్పించారు. ఇది జగన్ ప్రభుత్వ కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలు భక్తుల విశ్వాసాన్ని పెంచాయని ధార్మిక వర్గాలు చెబుతున్నాయి.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామనే వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనిపించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక ఇప్పుడు ప్రధాన వివాదం ఆలయాల నిర్మాణ పనుల కేటాయింపుపై నెలకొంది. శ్రీవాణి ట్రస్టుకు చెందిన సుమారు రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 5,000 ఆలయాలు, భజన మందిరాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ పనులను టెండర్ల ప్రక్రియ లేకుండా అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం రూ.5 లక్షలకు మించిన ప్రతి పనిని టెండర్ ద్వారా ఇవ్వాలి. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రత్యేక అధికార పాలన కొనసాగుతుండగా, నిర్మాణ పనులు రాజకీయ నాయకుల పర్యవేక్షణలో జరగడం అధికార యంత్రాంగాన్ని బలహీనపరుస్తుందని శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు గత ప్రభుత్వం దిగిపోయే నాటికే 4,111 ఆలయాల నిర్మాణాలకు పారదర్శక టెండర్ల ద్వారా అనుమతులు ఇచ్చింది. వాటిలో 622 ఆలయాలు పూర్తికాగా, 1,765 ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన 1,724 ఆలయాలు ప్రారంభ దశలో ఉండగా, వాటి అనుమతులను రద్దు చేయాలని 2024 ఆగస్టు 27న జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. అనంతరం దేవాదాయ శాఖ అన్ని జిల్లాలకు అధికారిక సమాచారాన్ని పంపింది.

ఇప్పుడు తిరిగి అదే శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణానికి అనుమతులు ఇస్తూనే, టెండర్ల విధానం పక్కనపెట్టి అధికార పార్టీ నేతలకు పనులు అప్పగించాలన్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత ప్రభుత్వం ఒక్కో ఆలయానికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పారదర్శకంగా పనులు కేటాయించిందని ధార్మిక వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

మరింత ఆందోళన చందాల వినియోగంపైనే వ్యక్తమవుతోంది. గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి స్థానిక భక్తులు, దాతలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో నిర్మాణ బాధ్యతలు రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్తే చందాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల విశ్వాసంతో నడిచే ధార్మిక కార్యక్రమాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

గత వైసీపీ పాలనలో శ్రీవాణి ట్రస్టు నిజంగా ధార్మిక సేవలకే పరిమితమైతే, కూటమి పాలనలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం కొత్త వేదికగా మారుతోందనే ఆరోపణలు తీవ్ర సంచలంగా మారుతున్నాయి.? ధార్మిక విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తుండటం గమనార్హం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment