తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) అసెంబ్లీలో (Assembly) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి బడ్జెట్‌ను (Budget) ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో మహిళలు, విద్యార్థులు, యువత, రైతులు, పేద కుటుంబాలు, ఆరోగ్యం, విద్య, పర్యావరణం, క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ముఖ్యంగా 11వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు (Bicycles), మహిళలకు గోల్డ్ కాయిన్స్ (Gold Coins), పట్టు చీరలు(Silk Sarees), హజ్ సబ్సిడీ (Haj Subsidy) పెంపు వంటి పథకాలు ఈ బడ్జెట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
విద్యార్థులు, మహిళలకు భారీ వరాలు
ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో చదువుతున్న 11వ తరగతి విద్యార్థులకు (Class 11 Students) ఆధునిక సైకిళ్లను అందించేందుకు ప్రభుత్వం రూ.277 కోట్లు కేటాయించింది. సైకిళ్లతో పాటు హెల్మెట్లు, వాటర్ బాటిళ్లను కూడా పంపిణీ చేయనుంది. విద్యార్థులకు సురక్షిత రవాణా కల్పించడం, యువతలో ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
అలాగే మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన మహిళలకు(Women’s) గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం అమలుకు రూ.812 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో వెల్లడించింది.
హజ్ యాత్రకు (Haj Pilgrimage) వెళ్లే వారికి అందిస్తున్న సబ్సిడీని రూ.25,000 నుంచి రూ.35,000కు పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
NEET, పారదర్శక పాలనపై ఫోకస్
NEET పరీక్షను రద్దు చేసి, గతంలో అమల్లో ఉన్న విధానాన్ని తిరిగి తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించే విధానానికే తమ మద్దతు కొనసాగుతుందని పేర్కొంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్రమాలు, లంచాలకు అవకాశం లేకుండా టెండర్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
క్రీడలు, పర్యావరణం, గృహ నిర్మాణానికి ప్రాధాన్యం
యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రూ.42 కోట్లతో గ్రామీణ క్రీడా పోటీలను (Rural Sports Competitions) నిర్వహించనుంది. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ సంరక్షణ కోసం రూ.1,762 కోట్లు కేటాయించింది. గ్రీన్ అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపింది.
కచ్చా ఇళ్లను పక్కా ఇళ్లుగా మార్చేందుకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.3.10 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ‘వీడు వెట్టి’ పథకం (Veedu Vetti Scheme) కింద రూ.3,500 కోట్లతో 70,000 పక్కా ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
శాఖల వారీగా కేటాయింపులు
గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ – రూ.8,852 కోట్లు
విద్యుత్ శాఖ – రూ.15,828 కోట్లు
చేనేత మరియు వస్త్ర పరిశ్రమల శాఖ – రూ.1,678 కోట్లు
పరిశ్రమల శాఖ – రూ.4,414 కోట్లు
MSME శాఖ – రూ.2,142 కోట్లు
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ – రూ.4,880 కోట్లు
సహకార శాఖ – రూ.8,028 కోట్లు
ఆరోగ్య శాఖ – రూ.23,357 కోట్లు
సామాజిక సంక్షేమ శాఖ – రూ.9,818 కోట్లు
దివ్యాంగుల సంక్షేమ శాఖ – రూ.1,485 కోట్లు
మొత్తంగా తమిళనాడు బడ్జెట్ 2026లో విద్యార్థులు, మహిళలు, యువత, పేద కుటుంబాలు, ఆరోగ్యం, పర్యావరణం, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సైకిళ్ల పంపిణీ, గోల్డ్ కాయిన్స్, పట్టు చీరల పథకం, హజ్ సబ్సిడీ పెంపు, పక్కా ఇళ్ల నిర్మాణం, 10 ఒలింపిక్ ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు వంటి నిర్ణయాలు ఈ బడ్జెట్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి.







