రాష్ట్రంలో టోల్‌గేట్ల (Toll Gates వద్ద వరుసగా జరుగుతున్న దాడులు (Attacks) ఆందోళన కలిగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ శ్రేణులకు (Coalition Government Cadres) అడ్డూ అదుపు లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితిని వారి అనుచరులు కూడా అనుసరిస్తున్నట్లు తాజా ఘటనలు సూచిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం గండబోయినపల్లెలో టోల్‌గేట్ వద్ద జరిగిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendra Babu) వాహనాన్ని ఆపినందుకు ఆగ్రహించిన అనుచరులు టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి దిగారు. సిబ్బందిని చితకబాదటమే కాకుండా, టోల్‌గేట్ మేనేజర్‌ను కారులో బలవంతంగా తీసుకెళ్లిన ఘటన మరింత ఆందోళనకు దారితీసింది. మహిళా సిబ్బందిపై కూడా జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా ప్రవర్తించి, దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫూటేజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇలాంటి ఘటనలు ఇది ఒక్కటే కాకుండా గతంలో కూడా జరిగాయి . నందవరం మండలం హాలహర్వి టోల్‌గేట్ వద్ద టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి (Palakurthi Srinivas Reddy) టోల్ వసూలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా దాడికి దిగినట్లు దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.
అలాగే కొద్ది రోజుల క్రితమే నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పరిసర ప్రాంతంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి (Budda Rajasekhar Reddy) వర్గీయులు టోల్‌ప్లాజా ఉద్యోగి మహేష్‌ను(Mahesh) బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన ఘటన మరింత సంచలనంగా మారింది. టోల్ చెల్లింపులో ఆలస్యం జరిగినందుకు ఆగ్రహించిన ఎమ్మెల్యే, ‘నేనెవరినో తెలియదా’ అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. అనంతరం మహేష్‌ను గ్రామానికి తీసుకెళ్లగా, కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దల జోక్యంతో విడుదల చేశారు.
ఈ వరుస సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. గూండాల రాజ్యంగా మారుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. అధికార అండతో కొందరు నేతలు తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు మరింతగా వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో చట్టాన్ని అతిక్రమించే ఇటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.







