ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరోసారి వేడి రాజుకుంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో కోనసీమ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల ముందు కాపు (Kapu) సామాజిక వర్గానికి తానే ప్రధాన ప్రతినిధినని ప్రచారం చేసుకున్న జనసేన(Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఆ వర్గంలో వినిపిస్తున్నాయి. తమ సమస్యలను ప్రస్తావించిన వారిపైనే తాను కుల నాయకుడు కాదని వ్యాఖ్యానించడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గం (Capu Community) తన విజయానికి కీలక పాత్ర పోషించిందని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, గెలిచిన తర్వాత అదే వర్గాన్ని దూరం పెడుతున్నారనే అసంతృప్తి కొంతమంది కాపు నేతలు, కార్యకర్తలలో వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కాపు సామాజిక వర్గానికి నష్టం జరుగుతోందని, ఆ వర్గ సమస్యలపై గళమెత్తాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని(YSRCP) కాపు నాయకులు ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తుల (Thota Trimurthulu) ఆధ్వర్యంలో నిర్వహించిన సభ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆ సభ విజయవంతం కావడంతో జనసేన (Jana Sena) డిఫెన్స్ లోకి (Defensive Mode) వెళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో కాపు-రెడ్డి (Kapu-Reddy) వర్గాల మధ్య విభేదాలను మళ్లీ తెరపైకి తీసుకురావాలనే రాజకీయ వ్యూహంలో భాగంగానే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని ముందుకు తెచ్చారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో నానాజీ(Nanaji), వైఎస్ జగన్‌పై (YS Jagan) తీవ్ర విమర్శలు చేస్తూ, దమ్ముంటే కాకినాడ వచ్చి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
దీనిపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, జనసేన వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఆయనకు ఊహించని రీతిలో ప్రతి సవాల్ విసిరారు.
“జగన్ గారి వరకు ఎందుకు? నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్‌లో (Kakinada Rural) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. మీరు మీ ఎమ్మెల్యే(MLA) పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయగలరా? నేను ఓడిపోతే జీవితంలో రాజకీయాల్లోకి తిరిగి రాను. ఈ సవాల్‌కు నేను కట్టుబడి ఉంటాను. మీరు సిద్ధమేనా?” అంటూ తోటా త్రిమూర్తులు బహిరంగంగా ప్రశ్నించారు.
ఈ సవాల్ ప్రస్తుతం కాకినాడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తోటా త్రిమూర్తుల సవాల్‌ను పంతం నానాజీ స్వీకరిస్తారా లేదా అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఒకవైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ సవాల్ జనసేనను ఇబ్బందుల్లోకి నెట్టిందని వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు జనసేన శ్రేణులు దీనికి ఎలా స్పందించాలనే అంశంపై మథనపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.






