తిరుమల వ్యవహారాలపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో, ఆయనపై కూటమి నేతలు లక్ష్యంగా పనిచేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మళ్లీ వేడెక్కుతోంది. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన వివాదాస్పద ఫోటోలు, వీడియోలు బయటకు రావడం, వాటిపై భూమన తీవ్రంగా స్పందిస్తూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది.
మొదట భూమన హయాంలో ముద్రించిన భగవద్గీత పుస్తకాలపై ఆరోపణలు తెరపైకి తీసుకువచ్చినప్పటికీ, వాటిలో స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో ఆ విమర్శలు బలహీనపడ్డాయని ప్రచారం జరిగింది. ఆ తర్వాత భూమన వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్లను ప్రలోభపెట్టి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
ఇప్పుడు తాజాగా తిరుపతిలో కొందరు సాధువుల రూపంలో భూమనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడం మరోసారి రాజకీయ వేడి పెంచింది. “తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు”, “వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలి” అంటూ వారు డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం పేరుతో వచ్చినవారు అసలు సాధువులు కాదని, వారు తెలుగుదేశం కార్యకర్తలేనని ఆరోపించారు. పసుపు వస్త్రాలు విడిచిపెట్టి కాషాయం ధరించి తన ఇంటి ముట్టడికి వచ్చారని వ్యాఖ్యానించారు.
ఇక ఈ ఘటనలో మరో మలుపు చోటుచేసుకుంది. నిరసనకు వచ్చిన వారిలో ఒకరు “మాకు అసలు విషయం తెలియదు.. టిఫిన్ పెడతామని తీసుకువచ్చారు” అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ నిరసన వెనుక రాజకీయ ప్రణాళిక ఉందనే చర్చ తిరుపతిలో మరింత బలపడింది.
అదే సమయంలో ఏపీ సాధు పరిషత్ గౌరవాధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్న అట్లూరి నారాయణరావు పేరు కూడా వివాదంలోకి వచ్చింది. ఆయన నిజంగా సాధువు కాదని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్‌టీఆర్ లిటరేచర్ కమిటీ గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారని, పలు వివాదాలు మరియు కేసులతో ఆయన పేరు గతంలోనూ వార్తల్లో నిలిచిందనే చర్చ జరుగుతోంది.
మొత్తానికి భూమనపై రాజకీయంగా పైచేయి సాధించాలని కూటమి చేస్తున్న ప్రతి ప్రయత్నం తిరగబడుతోందా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తిరుమల పరిపాలన, భక్తుల సమస్యలు, ఆలయ పవిత్రత వంటి అసలు అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలు, ప్రతివిమర్శలు మరింత రాజకీయ దుమారం రేపుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.






