---Advertisement---

పిఠాపురం వర్మపై చర్యతో టీడీపీ కేడర్ లో గందరగోళం?

May 7, 2026

---Advertisement---

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన నిర్ణయం ఇప్పుడు కూటమి రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. వర్మ చేసిన వ్యాఖ్యలు, వ్యవహార శైలి తప్పేనని కొందరు భావిస్తున్నప్పటికీ.. అదే సమయంలో జనసేనకు చెందిన పలువురు నేతలపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎందుకనే ప్రశ్న టీడీపీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. దీంతో వర్మపై తీసుకున్న చర్య వెనుక రాజకీయ ఒత్తిడులున్నాయా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన నేతలపై గత కొంతకాలంగా వివిధ వివాదాలు, దాడుల ఆరోపణలు, మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, అధికారులపై దౌర్జన్యాలు వంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. వాటిపై కఠిన చర్యలు తీసుకోలేదని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలు, కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యవహారం, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌పై విమర్శలు, శ్రీశైలం జనసేన నేత అశోక్ రౌత్‌పై వచ్చిన ఆరోపణలు వంటి అంశాలను ఇప్పుడు ఉదాహరణలుగా ప్రస్తావిస్తున్నారు.

అంతేకాకుండా తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్‌పై మహిళల నుంచి వచ్చిన ఆరోపణలు, హర్షవీణ ఘటనలో జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ప్రవర్తన వంటి అంశాల్లోనూ ఎలాంటి కఠిన చర్యలు కనిపించలేదని పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌, ఎంపీ కేసినేని చిన్నీ మధ్య జరిగిన రాజకీయ వివాదం కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చినా.. అక్కడ మాత్రం పార్టీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు అంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో “పిఠాపురంలో మాత్రమే ఎందుకు కఠిన నిర్ణయం?”, “వర్మ విషయంలో ప్రత్యేకంగా ఒత్తిడి పనిచేసిందా?”, “జనసేనను ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు సొంత పార్టీ నేతలపై చర్యలకు దిగుతున్నారా?” అనే ప్రశ్నలు టీడీపీ అంతర్గత వర్గాల్లోనే వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో పొత్తు తర్వాత చంద్రబాబు నాయకత్వ ధోరణిలో మార్పు వచ్చిందనే అభిప్రాయం కొందరు సీనియర్ తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోందని సమాచారం. కూటమి సమీకరణాల కోసం సొంత పార్టీ నేతల మనోభావాలను పక్కన పెడితే భవిష్యత్తులో అది పార్టీ మనుగడపైనే ప్రభావం చూపుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వర్మ వ్యవహారం ఇప్పుడు ఒక వ్యక్తి పదవి కోల్పోవడాన్ని మించి.. టీడీపీ-జనసేన సంబంధాల్లో అసలు సమీకరణాలు ఎలా ఉన్నాయనే చర్చకు కేంద్రబిందువుగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment