వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) విషయంలో మరోసారి రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) (TBM) తొలగింపు అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అయితే ప్రాజెక్టు పురోగతి గణాంకాలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చంద్రబాబు (Chandrababu Naidu) అధికారంలో ఉండగా 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు ఐదేళ్ల కాలంలో కేవలం 600 మీటర్ల మేర మాత్రమే సొరంగం తవ్వకాలు జరిగాయి. అంటే రోజుకు సగటున 0.32 మీటర్లు మాత్రమే పురోగతి నమోదైంది. ఇది ప్రాజెక్ట్ చరిత్రలోనే అత్యంత పేలవమైన పనితనంగా చెబుతున్నారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం (YSRCP Government) అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నవంబర్ నుంచి 2021 జనవరి 13 వరకు మొదటి సొరంగంలో 3.6 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తి చేశారు.
ఈ సమయంలో కరోనా లాక్‌డౌన్(Corona Lockdown), నల్లమల (Nallamala) అడవుల్లో భారీ వర్షాలు వంటి అనేక అడ్డంకులు ఎదురైనా రోజుకు సగటున 9.23 మీటర్ల వేగంతో పనులు పూర్తి చేయడం ప్రాజెక్టు చరిత్రలో కీలక ఘట్టంగా చెప్పబడుతోంది. అంతేకాదు, 2021లో పూర్తయిన మొదటి టన్నెల్‌లో చివరి 1.1 కిలోమీటర్ల దూరాన్ని మానవీయ పద్ధతిలో తవ్వడం, అనంతరం మొదటి టన్నల్ నుండి టన్నెల్ బోరింగ్ మిషన్‌ను మూడు నెలల్లో విడదీయడం కూడా అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది.
అయితే ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రెండవ టన్నల్ లో టీబీఎంను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. టీబీఎం తొలగించకుండా వెలిగొండ ద్వారా చుక్క నీరు కూడా బయటకు రాదని, ఇంకా వేల కోట్ల రూపాయల పనులు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు.
అయితే మరోవైపు పలువురు విశ్లేషకులు భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి వాదన ప్రకారం వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత క్లిష్టమైన రెండు టన్నెల్ తవ్వకాల పనులను పూర్తి చేయడం అనేది ప్రాజెక్టు నిర్మాణంలోనే అత్యంత పెద్ద విజయంగా భావించాల్సిన అంశమని చెబుతున్నారు. అప్పట్లోనే టన్నెల్-2లో చిక్కుకున్న టీబీఎంను మొదటి టన్నల్ లో తీసిన విదంగానే మూడు నుంచి నాలుగు నెలల్లో తొలగించి రైతులకు త్వరగా నీరు అందించే ప్రయత్నం చేస్తామని జగన్ ప్రకటించిన విషయం గుర్తుచేస్తున్నారు.
అయితే ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఆ బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడిందని, కానీ రెండేళ్లు గడిచినా టీబీఎం తొలగింపు పనులు ముందుకు సాగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత డిసెంబర్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు టీబీఎం తొలగింపుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఐదు నెలలు దాటినా స్పష్టమైన పురోగతి కనిపించలేదని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ఇప్పుడు కూడా టీబీఎం బయటకు తీయలేదనే బాధ్యతను పూర్తిగా వైసీపీపై మోపడం తమ అసమర్ధతను కప్పిపుచ్చుకునే రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వెలిగొండ ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పటికీ 2004 వరకు అటవీ అనుమతులు కూడా పూర్తిగా సాధించలేదనే విమర్శలు ఉన్నాయి. అనంతరం వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ శంకుస్థాపన చేసి అనుమతులు సాధించి, జర్మనీ నుంచి టన్నెల్ బోరింగ్ మిషన్ తెప్పించి పనులను వేగవంతం చేసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే 2014-19 మధ్య ప్రాజెక్టు పేరుతో కొందరికి ఆర్థిక లాభాలు చేకూర్చడమే తప్ప పనులు వేగంగా ముందుకు సాగలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ హయాంలో రికార్డు స్థాయిలో టన్నెల్ పనులు పూర్తయ్యాయని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా టీబీఎంను తొలగించకపోవడం, ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలులో కూడా జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా? లేక మరోసారి రాజకీయాలకే పరిమితం అవుతోందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసి క్రెడిట్ తీసుకునే ఎత్తుగడ వేస్తుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా చర్చకు వస్తున్నాయి.






