తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి(CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా సంక్షేమం, మద్యం నియంత్రణ, సామాజిక బాధ్యతల అంశాల్లో ఆయన తీసుకుంటున్న చర్యలు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి (YS Jagan Mohan Reddy) అమలు చేసిన విధానాలను గుర్తు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్(Vijay) తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మొదటిగా ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేయడం ద్వారా దివంగత నేత వై.యస్.రాజశేఖరరెడ్డి (Y. S. Rajasekhara Reddy) సంక్షేమ రాజకీయాలను గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్‌ల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలన్న నిర్ణయం మరింత సంచలనంగా మారింది.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్మాక్ మద్యం దుకాణాలపై నిర్వహించిన ప్రత్యేక సర్వేలో 500 మీటర్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 717 దుకాణాలు గుర్తించబడినట్లు సమాచారం. వీటిలో దేవాలయాలు, చర్చిలు, మసీదుల సమీపంలో ఉన్నవి 276 కాగా, పాఠశాలలు మరియు కళాశాలల సమీపంలో 186, బస్ స్టాండ్‌ల సమీపంలో 255 దుకాణాలు ఉన్నట్లు తేలింది. ఈ దుకాణాలన్నింటినీ రెండు వారాల్లోగా మూసివేయాలని విజయ్ ఆదేశించారని వార్తలు రావడం తమిళనాడులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ కొత్త చర్చకు తెరలేపింది.
విజయ్ ఈ నిర్ణయానికి “ప్రజా సంక్షేమం”(Public Welfare)నే ప్రధాన కారణంగా పేర్కొనడం విశేషం. రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టే మద్యం విక్రయాలపై ఆధారపడే పరిస్థితి ఉన్నప్పటికీ, ప్రజా ఆరోగ్యం, సామాజిక భద్రత, యువత భవిష్యత్తు ముఖ్యమని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఈ పరిణామం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానం మళ్లీ చర్చకు వస్తోంది. ఎన్నికల హామీ మేరకు జగన్ ప్రభుత్వం మద్యం నియంత్రణపై పలు కీలక చర్యలు చేపట్టింది. టీడీపీ ప్రభుత్వ కాలంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కు తగ్గించింది. ప్రతి వైన్ షాప్‌కు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నడిచిన వేలాది బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంది.
అదే సమయంలో ప్రైవేట్ మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ ఆధ్వర్యంలో విక్రయ వ్యవస్థను తీసుకువచ్చింది. మద్యం విక్రయ సమయాలను పరిమితం చేయడం, ధరలను పెంచడం, అక్రమ మద్యం నియంత్రణ కోసం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు చేయడం వంటి చర్యలు అప్పట్లో విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదన్న అంశాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుడులు, పాఠశాలలు, చర్చిలు, మసీదులు, ఆసుపత్రుల సమీపంలోనే మద్యం దుకాణాలు పెరిగిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పర్మిట్ రూమ్‌లు మళ్లీ వెలుగులోకి రావడం, బెల్ట్ షాపులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం, అక్రమ మద్యం విక్రయాలు పెరగడం వంటి అంశాలు సామాజిక ఆందోళనకు కారణమవుతున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి రావడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో బయటపడిన అక్రమ మద్యం వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలపైనే విమర్శలు రావడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
ఇప్పుడు తమిళనాడులో విజయ్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మద్యం నియంత్రణ చర్చకు ఊపిరి పోసిందని. ప్రజా సంక్షేమం పేరుతో ఆదాయాన్ని పక్కనపెట్టి కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ప్రభుత్వాలకు ఉందా? లేక మద్యం ఆదాయంపైనే ఆధారపడే రాజకీయ ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుందా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్ తీసుకున్న నిర్ణయాలు కేవలం పరిపాలనా చర్యలు మాత్రమే కాకుండా ప్రజల్లో ఒక నైతిక సందేశాన్ని పంపే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా “గుడి-బడి-ఆసుపత్రి పరిసరాల్లో మద్యం దుకాణాలు వద్దు” అనే డిమాండ్ బలపడుతోందని చెబుతున్నారు..
ఇప్పుడు తమిళనాడు మోడల్ ప్రభావంతోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మద్యం నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటుందా? లేక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం కొనసాగుతున్న విధానానికే కట్టుబడి ఉంటుందా? అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది.






