విశాఖ (Visakhapatnam) రైల్వే జోన్ (Railway Zone) సాధన కోసం ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ఇచ్చిన ప్రధాన హామీల్లో విశాఖ రైల్వే జోన్ ఒకటి. అయితే 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government), రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) ఈ అంశంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయన్న విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా రైల్వేజోన్‌కు సంబంధించిన పరిణామాలు చూస్తుంటే.. విశాఖ జోన్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాల్తేరు డివిజన్‌ను (Waltair Division) విభజించి, కీలకమైన ఆదాయ వనరులను ఇతర జోన్లకు తరలించడం ద్వారా విశాఖ రైల్వేజోన్‌ను కేవలం పేరుకే పరిమితం చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్‌గా గుర్తింపు పొందిన వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసి, రాయగడ వంటి ప్రాంతాలను ఇతర జోన్లలో కలపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు, విశాఖ కేంద్రంగా పూర్తి స్థాయి జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జోన్ కార్యాలయ నిర్మాణం, సిబ్బంది నియామకాలు, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాల్లో ఎలాంటి వేగం కనిపించడం లేదని ఉద్యోగ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఇక రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో గట్టిగా పోరాడటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండటం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో విశాఖ రైల్వేజోన్‌ను గొప్ప విజయంగా ప్రచారం చేసిన నేతలు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీస్తున్నారు.
రైల్వేజోన్ కోసం ఉద్యమించిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ఆదాయం వచ్చే కేకే లైన్ తొలగిస్తే ఈ జోన్ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విశాఖ రైల్వేజోన్‌ను (కేకేలైన్, అరకు) కలిపి పూర్తి స్థాయిలో అమలు చేసి, వాల్తేరు డివిజన్ ప్రాధాన్యతను కాపాడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను మోసం చేసినట్టేనని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






