ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (South Coast Railway Zone) ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉంది. ఒకవైపు జోన్ ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే, రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చే వనరులను పొరుగు రాష్ట్రానికి కట్టబెట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం మే 4, 2026న విడుదల చేసిన గెజిట్ ప్రకారం, జూన్ 1, 2026 నుండి విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway Zone) అమలులోకి వస్తుందని ప్రకటించింది. అయితే, ఇదే గెజిట్‌లో ఒడిశాలోని రాయగడ (Rayagada) కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా పేర్కొంది. అత్యంత వివాదాస్పదమైన విషయం ఏమిటంటే, దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే కొత్తవలస–కిరండోల్ (Kottavalasa–Kirandul Line) మార్గాన్ని (సుమారు 442 కి.మీ) మరియు ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు రైల్వే మార్గాన్ని విశాఖ జోన్‌లో కలపకుండా, ఒడిశాలోని రాయగడ డివిజన్‌లో కలిపారు.
నిజానికి గతంలో వాల్తేరు రైల్వే డివిజన్ సుమారు 11 వేల కోట్ల వార్షిక ఆదాయంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. ఈ ఆదాయంలో సింహభాగం కేకే లైన్ (కొత్తవలస–కిరండోల్) ద్వారా వచ్చే సరుకు రవాణా మరియు ఓడరేవులతో అనుసంధానమైన కార్గో ద్వారా లభించేది. ఇప్పుడు ఈ లైన్‌ను రాయగడలో కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్ తన ప్రధాన ఆదాయ వనరును కోల్పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పర్యాటక కేంద్రమైన అరకు కూడా రాయగడ పరిధిలోకి వెళ్లడం వల్ల, దాని అభివృద్ధి ఇకపై ఒడిశా అధికారుల నిర్ణయాలపై ఆధారపడి ఉండబోతోందని, ఇది రాష్ట్ర పర్యాటక రంగానికి మరియు స్థానిక ఉపాధికి కోలుకోలేని దెబ్బగా మారుతుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయం వెనుక ఒడిశా రాష్ట్రానికి మేలు కలిగించడమే లక్ష్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం కీలకమైన అడుగులు వేశారు. జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి అవసరమైన 52.22 ఎకరాల భూమిని విశాఖపట్నం ముదసర్లోవలో కేటాయించింది జగన్ ప్రభుత్వమే. రైల్వే మరియు జివిఎంసీ మధ్య భూముల మార్పిడి ప్రక్రియను పూర్తి చేసి, సరిహద్దుల గుర్తింపును కూడా పూర్తిచేశారు. రైల్వే బోర్డు 149.16 కోట్లతో 12 అంతస్తుల భవన నిర్మాణానికి టెండర్లు పిలవడానికి కూడా జగన్ ప్రభుత్వం అప్పగించిన భూమే ఆధారమైంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ(TDP), జనసేన (Janasena Party) మరియు బీజేపీ(BJP) కూటమి అధికారంలో ఉండి, కేంద్రంతో పొత్తులో ఉన్నప్పటికీ ఈ అన్యాయాన్ని అడ్డుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా పర్యాటక శాఖ జనసేన చేతిలో ఉన్నప్పటికీ, అరకు వంటి కీలక పర్యాటక ప్రాంతం వేరే రాష్ట్ర డివిజన్‌లోకి వెళ్తుంటే నిలువరించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రానికి వెన్నెముకలాంటి కేకే లైన్‌ను కోల్పోతున్నా కూటమి నేతలు నోరు మెదపకపోవడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని ప్రజలు భావిస్తున్నారు. రాయగడ డివిజన్‌లో కలిపిన అరకు మరియు కేకే లైన్లను తక్షణమే వెనక్కి తీసుకువచ్చి విశాఖపట్నం డివిజన్‌లో కలపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న వాల్తేరు డివిజన్‌ను యథాతథంగా ఉంచి, పూర్తి ఆదాయ వనరులతో కూడిన జోన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు అందించాలని కోరుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సవరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర భూములను జోన్ కోసం ఇచ్చినా, ఆదాయం వచ్చే మార్గాలను మాత్రం పొరుగు రాష్ట్రానికి కట్టబెట్టడం కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడగా కనిపిస్తోందని ఉత్తరాంధ్ర మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గెజిట్ సవరణ కోసం పోరాడకపోతే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసినట్లవుతుంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు కూటమి నాయకులను క్షమించే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.






