విశాఖపట్నం (Visakhapatnam) స్టీల్ ప్లాంట్‌లో (Steel Plant) జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. 1,540 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవరూప ఉక్కు (Molten Steel) కార్మికులపై (Workers) పడటంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 4 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
అత్యంత వేడిగా ఉన్న ద్రవ ఉక్కు శరీరాలపై పడటంతో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన తీరు చూసిన సహచర కార్మికులు, అధికారులు షాక్‌కు గురయ్యారు. ఊహించని రీతిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతోంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ కార్మికుడి వీడియో (Worker Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లంతా కాలిన గాయాలతో (Burn Injuries) అంబులెన్స్‌లో (Ambulance) ఆసుపత్రికి తరలిస్తుండగా, తన తోటి వ్యక్తితో వీడియో తీయించి కుటుంబ సభ్యులకు (Family Members) చివరి సందేశం పంపించాడు. చావుబతుకుల మధ్య కూడా తన భార్య(Wife), పిల్లల (Children) గురించే ఆ తండ్రి ఆలోచించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
‘వర్మ(Varma).. తమ్ముడిపై కోప్పడకు. తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి.. ఇక ఉంటాను డాడీ(Daddy)’ అంటూ అతడు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేస్తున్నాయి. చిన్న కుమారుడిని చదివించాలని, భార్యను జాగ్రత్తగా చూసుకోవాలని పెద్ద కొడుకుకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.
ఈ ప్రమాదంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు, బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని ప్రకటించారు.






