మహిళా రిజర్వేషన్ బిల్లుకు (Women Reservation Bill) మద్దతుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (Assembly Special Sessions) నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ప్రకటించారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకించిన ఇండీ కూటమి (INDI Alliance) పార్టీల వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఇండీ కూటమి పార్టీలు తీవ్రమైన అన్యాయం చేశాయని విమర్శించారు.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ప్రధాన పార్టీలలో ఏ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించలేదు. వైసీపీ, జనసేన, తెలుగుదేశం ఈ మూడు ప్రధాన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. ప్రతిపక్షంలో ఉన్నా జగన్ సైతం బిల్లు ఆమోదం పొందకుండా నిలిచిపోయిన సమయంలో ఇండీ కూటమి సభ్యులపై తీవ్రంగా విమర్శలు చేశారు. జగన్ స్పందించిన తర్వాతే పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చంద్రబాబు (Chandrababu) కూడా స్పందించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ (Congress) మరియు వామపక్ష పార్టీలు కనీసం ఉనికిలో లేవని స్పష్టంగా తెలిసిందే. ఆయా పార్టీలు ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించాలంటే మరో 25 సంవత్సరాలైనా పట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిలో లేని ఇండీ కూటమి వైఖరిని ఎండగట్టడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటనేది సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్న. బలమైన పార్టీలు అన్నీ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రజలకు కొత్తగా వివరించాల్సింది ఏముంటుందని చర్చ జరుగుతోంది.
నిజానికి, 2023లో నాటి స్పీకర్ తెలిపిన వివరాల ప్రకారం ఒక రోజు శాసన సభ నిర్వహణకు రూ. 53.28 లక్షల ఖర్చు అవుతుంది. సభ నిర్వహణలో ఒక్క నిమిషానికి రూ. 88,802 ఖర్చు అవుతుందని కూడా స్పష్టం చేశారు. ఇది అంతా ప్రజా ధనం కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని వృథా చేయకుండా సద్వినియోగం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో, ఉనికిలో లేని పార్టీలను విమర్శించడానికి లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించిన ’16’ సంఖ్య తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్యను సూచిస్తుందని చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ మనుగడకు, అలాగే రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి ఈ 16 మంది ఎంపీల మద్దతు కీలకమని, ఈ నేపథ్యంలో బిల్లు సంఖ్యాబలం లేక పాస్ కాకపోవడంతో అన్ని వేళ్లు తెలుగుదేశం వైపే చూపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహస్యంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపి బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బిల్లు చర్చ సమయంలో ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలగడం అందరి దృష్టిని ఆకర్షించిందని అంటున్నారు. ఈ కారణంగా తెలుగుదేశం వ్యవహార శైలిపై బీజేపీ నాయకుల్లో అనుమానాలు పెరిగినట్టు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ అనుమానాల నేపథ్యంలో తన నిజాయితీని బీజేపీ నాయకత్వానికి నిరూపించుకునేందుకు చంద్రబాబు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఇండీ కూటమిపై విమర్శలు చేయాలని ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిలో లేని ఇండీ కూటమిని విమర్శించడానికి ప్రజాధనాన్ని ఈ విధంగా ఖర్చు చేయడం సమంజసమేనా అనే ప్రశ్నపై రాష్ట్రంలో అనేక వర్గాలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.







