---Advertisement---

ఇంటిపై పడిన అమర్‌నాథ్ యాత్రికుల బస్సు…39 మంది యాత్రికులకు గాయాలు!

July 28, 2026

Summarize with AI

---Advertisement---

జమ్ముకశ్మీర్‌లోని (Jammu & Kashmir) గందర్‌బాల్ (Ganderbal) జిల్లాలో అమర్‌నాథ్ యాత్ర (Amarnath Pilgrimage) ముగించుకుని తిరిగి వస్తున్న భక్తులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ (Hariganwan) వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ అదుపు కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం 39 మంది యాత్రికులు గాయపడగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న జమ్ముకశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ(ITBP), సీఆర్పీఎఫ్ (CRPF), భారత సైన్యం (Indian Army) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలే అయ్యాయని, అందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటనలో బస్సు ఢీకొన్న ఇల్లు(House) తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదే బస్సు సింధు నదిలోకి పడిపోకుండా అడ్డుకావడంతో భారీ విషాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో యాత్రికులు ప్రాణాలతో బయటపడిన ఘటన ఊరట కలిగించింది.

ఈ ప్రమాదంపై జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గందర్‌బాల్ డిప్యూటీ కమిషనర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన ఆయన, గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జూలై 2న ప్రారంభమైన అమర్‌నాథ్ వార్షిక యాత్రలో ఇప్పటివరకు 4.15 లక్షలకుపైగా భక్తులు పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది యాత్ర ఆగస్టు 28తో ముగియనుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment