---Advertisement---

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, 6 మంది మృతి(Video)!

August 26, 2026

Summarize with AI

---Advertisement---

సూర్యాపేట జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏలూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

కంటైనర్‌లో భారీ ఇనుప కడ్డీలు ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఘటనలో 6 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 5 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో మరో 15 నుంచి 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రితో పాటు సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి నుంచి పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

బస్సు డ్రైవర్ అతివేగం లేదా నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందా.. లేక రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ లారీని గుర్తించడంలో వైఫల్యం కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు, గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment