సిద్దిపేట జిల్లా (Siddipet District) రంగనాయక సాగర్ (Ranganayaka Sagar) వద్ద రైతులు (Farmers) చేపట్టిన పాదయాత్రలో (Foot March) బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత హరీష్ రావు (Harish Rao) పాల్గొన్నారు. రంగనాయక సాగర్ను నీటితో నింపాలనే లక్ష్యంతో రైతులే స్వచ్ఛందంగా ఈ యాత్ర చేపట్టారని, దీనికి బీఆర్ఎస్కు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కృత్రిమ కరువును సృష్టించిందని, రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి నీటి పంపింగ్ నిలిపివేసిందని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
సీఎం రేవంత్ (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు.. “నా రక్తం కావాలంటే ఇవ్వడానికి సిద్ధమే.. నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు (Motors) ఆన్ చేసి రైతుల పొలాలకు నీళ్లు అందించు” అంటూ సవాల్ విసిరారు. తన ప్రాణాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే 70 టీఎంసీల నీరు వృథాగా కిందికి వెళ్లిపోయిందని, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ హామీలను (Loan Waiver Promises) కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, రైతులకు 10 గంటల విద్యుత్ (Power Supply) కూడా అందడం లేదని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం నుంచి నీటి పంపింగ్ (Water Pumping) చేయాలని సూచిస్తున్న రిటైర్డ్ ఇంజినీర్లను బెదిరించడం సరైంది కాదని, ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎల్లంపల్లి వద్ద నీటి కొరత ఏర్పడితే విద్యుత్ ఉత్పత్తితో పాటు హైదరాబాద్ తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఖమ్మం పెద్దవాగు(Khammam Peddavagu), ఎస్ఎల్బీసీ(SLBC), వట్టెం పంప్ హౌస్(Vattem Pump House), సుంకిశాల ఘటనలపై విచారణలు ఎందుకు లేవని ప్రశ్నించారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే విచారణలు జరిపిస్తూ రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను గమనిస్తున్నారని, త్వరలోనే మళ్లీ బీఆర్ఎస్కు అవకాశం వస్తుందని హరీష్ రావు అన్నారు.








