భారతీయ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తన పవర్ఫుల్ విలన్ పాత్రలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (Pradeep Rawat) (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో (Blood Cancer) పోరాడుతున్న ఆయన ముంబైలోని (Mumbai) కోకిలాబెన్ ఆసుపత్రిలో(Kokilaben Hospital) చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
బీ.ఆర్. చోప్రా (B.R. Chopra) రూపొందించిన మహాభారత్ సీరియల్లో (Mahabharat Serial) అశ్వత్థామ పాత్రతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ రావత్, తర్వాత తనదైన విలనిజంతో ఎన్నో భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బాలీవుడ్లో లగాన్(Lagaan), సర్ఫరోష్ (Sarfarosh) చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు.
తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆయన ఎప్పటికీ ‘సై’(Sye) సినిమాలోని భిక్షు యాదవ్‌గానే గుర్తుంటారు. ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) దర్శకత్వంలో నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కిన సై సినిమాలో ఆయన పోషించిన విలన్ పాత్రకు (Villain Role) విశేష ఆదరణ లభించింది. అనంతరం గజినీ సినిమాలో టైటిల్ పాత్రతో మరోసారి తన నటనను చాటుకున్నారు. అలాగే భద్ర(Bhadra), స్టాలిన్(Stalin), ఛత్రపతి (Chatrapathi) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన చివరిసారిగా నటించిన గాయపడ్డ సింహం సినిమా మే 1న విడుదలైంది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రదీప్ రామ్‌సింగ్ రావత్ 1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) జబల్పూర్లో (Jabalpur) జన్మించారు. ఆయన తండ్రి రిటైర్డ్ మేజర్ మంగళ్ సింగ్ రావత్. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా మిలటరీ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన ఆయన, జబల్పూర్ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొంతకాలం యూకో బ్యాంకులో ఉద్యోగం చేసిన తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
దూరదర్శన్‌లో దాదాపు 2 సంవత్సరాలు ప్రసారమైన మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్ర ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రముఖ నటి స్మితా పాటిల్ సిఫారసుతో దర్శకుడు రవి చోప్రా ఆయనకు ఆ అవకాశం కల్పించినట్లు చెబుతారు. ఆ సీరియల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, బీబీసీ (BBC) వంటి అంతర్జాతీయ ఛానల్ కూడా ప్రసారం చేయడం విశేషం.
మహాభారత్ సీరియల్‌తో పాటు దేశంలోని ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ నగరాల్లో అనేక స్టేజ్ నాటకాల్లో కూడా ప్రదీప్ రావత్ నటించారు. ప్రముఖ నటుడు రాజ్ బబ్బర్ నాటక సంస్థలో రాజ్ బబ్బర్, అనుపమ్ ఖేర్, ఠాకూర్ కిరణ్, అనితా కవార్, అలోక్ నాథ్ వంటి దిగ్గజాలతో కలిసి నటించే అవకాశం రావడం తన జీవితంలో గొప్ప అదృష్టమని ఆయన పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. విలన్ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ప్రదీప్ రావత్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయింది.







