నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్(Question Paper Leak), సీబీఎస్‌ఈ (CBSE) ఓఎస్‌ఎం (OSM) వ్యవస్థలో (System) అవకతవకలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన వేళ ఢిల్లీలోని (Delhi) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party – CJP) చేపట్టిన భారీ నిరసన కార్యక్రమం (Mass Protest Program) ముగిసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Deepke) ఇచ్చిన పిలుపుతో వేలాది మంది యువత నిరసనలో పాల్గొన్నారు. జంతర్ మంతర్ పరిసరాలు నినాదాలతో మార్మోగిపోయాయి. విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు సీజేపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దీప్కే వేదికపై చదివి వినిపించారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ దేశవ్యాప్తంగా 8 లక్షల సంతకాలను సేకరించినట్లు ప్రకటించింది.
ఈ నిరసన కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) మద్దతు తెలపడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. స్వయంగా జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న సోనమ్ వాంగ్‌చుక్ విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదవాల్సిన పరిస్థితి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరమని సూచించారు.
సోనమ్ వాంగ్‌చుక్ ప్రసంగం జరుగుతున్న సమయంలో విద్యార్థులు ఆసక్తికర నినాదాలు చేశారు. సోనమ్‌నే కొత్త విద్యాశాఖ మంత్రిగా నియమించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ నినాదాలు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అయితే ఈ అంశంపై స్పందించిన సోనమ్ వాంగ్‌చుక్ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు కోసం యువతే ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఆయన సమాధానంతో అక్కడ ఉన్న విద్యార్థులు చప్పట్లతో స్పందించారు.
ఇదిలా ఉండగా నిరసన కార్యక్రమం మధ్యలో వేదికపై కొద్ది సేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతున్న సమయంలో పలువురు సీజేపీ ప్రతినిధులు ఒక్కసారిగా వేదికపైకి చేరుకోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది. వారిని కిందికి దిగాలని అభిజీత్ దీప్కేతో పాటు పలువురు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం వక్తలు తమ ప్రసంగాలను కొనసాగించారు.
కాగా సీజేపీ పార్టీని ప్రకటించిన తర్వాత అభిజీత్ దీప్కే తొలిసారిగా భారత్‌కు రావడం, జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకపై సీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.







