దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు (Supreme Court) 5 మంది కొత్త న్యాయమూర్తులను (Judges) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రాష్ట్రాల హైకోర్టుల (High Courts) ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గరిష్ట సంఖ్యను 34 నుంచి 38కు పెంచింది. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం మొత్తం 37 మంది న్యాయమూర్తులు విధులు నిర్వర్తించనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత వారం చేసిన సిఫార్సుల మేరకు ఈ నియామకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది.
పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు (Justice Sheel Nagu), బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ (Justice Chandrashekhar), మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్ దేవా(Justice Sanjeev Sachdeva), జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి(Justice Arun Palli), సీనియర్ అడ్వకేట్ వి. మోహనలను (V. Mohana) సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు.
వి. మోహన 2015లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. సాయుధ దళాల్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించడం, కర్ణాటక హిజాబ్ నిషేధం వంటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పలు కీలక కేసుల్లో ఆమె తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు చరిత్రలో 12వ మహిళా న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న జస్టిస్ బి.వి. నాగరత్నతో (Justice B.V. Nagarathna) కలిసి మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరనుంది. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక కావడం వల్ల వి. మోహనకు దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ పదవీకాలం లభించే అవకాశం ఉంది. ఆమె నియామకం న్యాయ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేసే అడుగుగా భావిస్తున్నారు.
In exercise of the power conferred by clause (2) of Article 124 of the Constitution of India, the President of India, after consultation with Chief Justice of India, is pleased to appoint the following as Judges of the Supreme Court of India. I convey my best wishes to them:- pic.twitter.com/WxHaRYWF6p
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) June 1, 2026








