కేంద్ర ప్రభుత్వం (Central Government) 2027 జనాభా లెక్కలకు (Census 2027) సన్నాహాలు ప్రారంభించింది. జనగణనలో తొలి దశలో అడగాల్సిన 40 ప్రశ్నలను (40 Questions) కేంద్రం నోటిఫై (Notify) చేసింది. ఈసారి కులం, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు సంబంధించిన వివరాలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు (COVID-19 Vaccination) సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించనున్నారు.
కులం ఆధారంగా కీలక సమాచారం
రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి వ్యక్తి షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందినవారా, వారి కులం ఏమిటి అనే వివరాలను నమోదు చేయనున్నారు. 2027 జనాభా లెక్కల ద్వారా దేశవ్యాప్తంగా సమగ్ర స్థాయిలో కుల సమాచారాన్ని సేకరించడం ఇదే తొలిసారి కానుంది.
కోవిడ్ టీకాపై వివరాల సేకరణ
జనగణనలో (Census) భాగంగా ప్రజలు కోవిడ్-19 వ్యాక్సిన్ ఎక్కడ తీసుకున్నారు అనే వివరాలను కూడా నమోదు చేయనున్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని జనాభా లెక్కల్లో సేకరించడం ఈసారి ప్రత్యేక అంశంగా నిలవనుంది.
మంచు ప్రాంతాలకు ప్రత్యేక షెడ్యూల్
మంచుతో కప్పబడిన, ఎగుడుదిగుడుగా ఉండే ప్రాంతాల్లో జనగణన ప్రక్రియ ముందుగానే ప్రారంభం కానుంది. లడఖ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని ఎంపిక చేసిన మంచు ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జనగణన నిర్వహించనున్నారు. దీనికి ముందు ఆగస్టు 17 నుంచి 31 వరకు ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
మిగతా రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో లెక్కలు
దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు నిర్వహించనున్నారు. ఈసారి జనగణనను 2 దశల్లో చేపట్టనున్నారు. తొలి దశలో ఇళ్లు, గృహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తారు. రెండో దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక, ఆర్థిక వివరాలను నమోదు చేస్తారు.
డిజిటల్ విధానంలో 2027 జనగణన
2027 జనాభా లెక్కలు దేశంలో 16వ జనగణన కాగా, స్వాతంత్ర్యం తర్వాత నిర్వహిస్తున్న 8వ జనగణన కానుంది. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడం మరో ప్రత్యేకత. మొబైల్ పరికరాల ద్వారా డేటాను సేకరించడంతో పాటు అవసరమైన చోట సమాచారాన్ని మాన్యువల్‌గా నమోదు చేసే సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు.
2021 లెక్కల వాయిదాతో మారిన షెడ్యూల్
కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. దీంతో 2027 జనగణనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. కులం, SC, ST వివరాలతో పాటు కోవిడ్-19 వ్యాక్సినేషన్ సమాచారం, డిజిటల్ డేటా సేకరణ వంటి అంశాలు ఈసారి జనగణనలో కీలకంగా మారనున్నాయి.








