ఢిల్లీ (Delhi) వేదికగా కొనసాగుతున్న సీజేపీ ఉద్యమం (CJP Movement) రోజురోజుకూ మరింత ఉధృతమవుతోంది. నేటితో 32వ రోజుకు చేరుకున్న ఈ నిరసనల్లో ఉద్యమకారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు డిమాండ్లతో ఆందోళనలు కొనసాగిస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) (CJP) తాజాగా తమ పోరాటాన్ని 4 ప్రధాన డిమాండ్లతో ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా జూలై 20న శాంతియుతంగా నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని, చట్టపరమైన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా (Ashutosh Ranka) కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భయంతో చాలామంది ఉన్నారని పేర్కొన్న ఆయన, అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే నిరసనకారుల కంటే ముందే తాము అరెస్టుకు సిద్ధమని ప్రకటిస్తూ ఉద్యమకారుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం తమ ఉద్యమం 4 ప్రధాన డిమాండ్లతో కొనసాగుతోందని రాంకా వెల్లడించారు. సోనమ్ వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా చేయడం, ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించడం, జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం తమ ప్రధాన డిమాండ్లని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు ఎంత పెరిగితే అంతకంటే బలంగా ప్రజా ఉద్యమం ముందుకు సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
జూలై 20న జరిగిన ఘటనలను ప్రస్తావించిన రాంకా(Ranka), పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టెంట్లు వేయకుండా ఆంక్షలు విధించడం, విద్యార్థులపై (Students) లాఠీచార్జ్ (Lathi charge) చేయించడం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయొచ్చని ప్రభుత్వం భావించిందని ఆరోపించారు. కానీ ఆ చర్యల తర్వాత ఉద్యమం ఆగకపోగా 100 రెట్లు మరింత విస్తరించిందని అన్నారు. ఢిల్లీ పోలీసులు (Delhi Police) వ్యవహరించిన తీరును ప్రపంచం మొత్తం చూసిందని, ప్రభుత్వ అహంకారానికి ప్రజలే సమాధానం చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు ఉద్యమకారులను ‘బొద్దింకలు’(Cockroaches), ‘వైరస్’(Virus) అంటూ విమర్శించిన ప్రభుత్వమే ఇప్పుడు చర్చలకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాంకా పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రారంభించారని, అదే తమ ఉద్యమం సాధించిన అతిపెద్ద విజయమని ఆయన అన్నారు. ఉద్యమం కేవలం విద్యార్థుల కోసమే కాకుండా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సాగుతోందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) తొలిసారిగా సీజేపీ(CJP) ప్రతినిధులతో అధికారిక చర్చలు జరిపింది. గత సోమవారం అశుతోష్ రాంకా(Ashutosh Ranka, సౌరవ్ దాస్‌లను (Sourav Das) కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తన ఢిల్లీ నివాసానికి ఆహ్వానించి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ 4 ప్రధాన డిమాండ్లతో కూడిన లిఖితపూర్వక వినతిపత్రాన్ని సీజేపీ నేతలు అందజేశారు. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని జేపీ నడ్డా సమయం కోరినట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు.








