కరూర్ (Karur) తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అంశంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు (Victim Families) ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం (Government) ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయిస్తే దానిని ఎలా ప్రశ్నిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
తొక్కిసలాటలో 41 మంది మృతి
గత ఏడాది సెప్టెంబర్‌లో నటుడు విజయ్(Vijay) పాల్గొన్న టీవీకే(TVK) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో చిన్నారులు సహా 41 మంది మృతి చెందారు. భారీగా జనసమీకరణ, తగిన సౌకర్యాలు లేకపోవడం వంటి అంశాలను పోలీసులు(Police) ప్రస్తావించగా, టీవీకే మాత్రం పోలీసుల వైఫల్యమే ఘటనకు కారణమని ఆరోపించింది.
ఉద్యోగాలపై హైకోర్టు అభ్యంతరం
బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు జూలై 27న రద్దు చేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16కు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి ప్రత్యేక నియామకాలకు అనుమతిస్తే భవిష్యత్తులో మరిన్ని అభ్యర్థనలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ జేబీ పార్దివాలా(Justice JB Pardiwala), జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌ల (Justice K. Vinod Chandran) ధర్మాసనం.. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే, అతని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదా అని ప్రశ్నించింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిని ఎలా ప్రశ్నిస్తామని వ్యాఖ్యానించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
32 మంది వారసులకు ఉద్యోగాలు
బాధిత కుటుంబాల పునరావాస చర్యల్లో భాగంగా ఇప్పటికే 32 మంది చట్టబద్ధ వారసులకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందించినట్లు సమాచారం. తాజా సుప్రీంకోర్టు ఆదేశాలతో బాధిత కుటుంబాలకు మరోసారి ఊరట లభించినట్లైంది. అయితే ఈ నియామకాలపై తుది న్యాయపరమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది.








