---Advertisement---

మమతా బెనర్జీ కారుపై చెప్పులు, బురద, నీళ్ల సీసాలతో దాడి.. బెంగాల్‌లో హైటెన్షన్..!

August 9, 2026

Summarize with AI

---Advertisement---

పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) నిరసన సెగ తగిలింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హాలిసహర్‌లో(Halisahar) ఆమె కాన్వాయ్‌ను (Convoy) ఆందోళనకారులు అడ్డుకున్నారు. మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారుపై బురద రాయడంతో పాటు చెప్పులు(Slippers), బూట్లు(Shoes), నీళ్ల సీసాలు (Water Bottles) విసిరినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీస్ కస్టడీలో టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్(Birju Kiyot) మృతి చెందడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా హాలిసహర్‌లో నిరసన ఎదురైంది. ఆందోళనకారులు ఆమె కారును చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని వెనక్కి పంపేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ‘‘దొంగను (Thief) తరిమికొట్టండి’’ అంటూ నినాదాలు చేశారు.

తనపై ఇటుకలు, రాళ్లతో దాడి జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. రాళ్లు, ఇటుకలు తనకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని ఆమె అన్నారు. కారు కిటికీలు మూసి ఉండకపోతే తన తలకు తీవ్ర గాయమై ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే బయట నుంచి వచ్చిన సంఘవిద్రోహ శక్తులు తన కారుపై దాడి చేశాయని ఆరోపించారు. ఇలాంటి దాడిని తాను గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని, తమను రక్షించేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

మమతా బెనర్జీపై జరిగిన దాడిని టీఎంసీ నేతలు తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(Kalyan Banerjee), రాజ్యసభ ఎంపీ డోలా సేన్ (Dola Sen) ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనను బీజేపీ కూడా ఖండించింది. మమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడితో తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య స్పష్టం చేశారు.

రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని బీజేపీ(BJP) ఎప్పటికీ సమర్థించదని సామిక్ భట్టాచార్య అన్నారు. ఇలాంటి ఘటనలు పశ్చిమ బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురై మరణించడంతో ఈ వివాదం మొదలైంది. పోలీసుల చిత్రహింసల కారణంగానే కియోట్ మృతి చెందాడని టీఎంసీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అతడి భార్య డిమాండ్ చేస్తోంది. అయితే పోలీసులు మాత్రం గుండెపోటు కారణంగానే బిర్జు కియోట్ మరణించాడని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment