టాటా సన్స్ చైర్మన్ (Tata Sons Chairman)ఎన్. చంద్రశేఖరన్(N. Chandrasekaran) తన పదవికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 ఫిబ్రవరి 20తో ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి చైర్మన్‌గా కొనసాగేందుకు తాను ఆసక్తిగా లేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో టాటా గ్రూప్(Tata Group) తదుపరి చైర్మన్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది.
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరారు. 2009లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్ ఆధ్వర్యంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా సహా 30కి పైగా సంస్థలు ఉన్నాయి.
2027 తర్వాత మరో 5 సంవత్సరాల పాటు చంద్రశేఖరన్‌ను కొనసాగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్(Sir Dorabji Tata Trust), సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు(Sir Ratan Tata Trust) సిఫారసు చేశాయి. అయితే ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడి మద్దతు లభించకపోవడంతో ఈ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రాలేదు.
ఈ పరిస్థితుల్లో పునర్నియామకం కోసం తన పేరును ప్రతిపాదించకూడదని చంద్రశేఖరన్ బోర్డుకు తెలిపారు. అలాగే తన వారసుడిని త్వరగా ఎంపిక చేసి, నాయకత్వ మార్పు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. చంద్రశేఖరన్‌కు టాటా గ్రూప్‌తో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. 2027 ఫిబ్రవరిలో ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు బాధ్యతల్లో కొనసాగి, ఆ తర్వాత చైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నారు.








