యూపీఐ లావాదేవీలపై (UPI Transactions) ఎలాంటి పన్నులు, అదనపు చార్జీలు విధించడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్పష్టం చేశారు. ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్లు’ (Amendment Bill)కు పార్లమెంట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో (Rajya Sabha) స్వల్ప చర్చ జరిగిన అనంతరం వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించారు.
ఈ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. కొత్త చట్టం ద్వారా యూపీఐ లావాదేవీలపై ఎలాంటి పన్నులు విధించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులు గతంలో మాదిరిగానే ఉచితంగా కొనసాగుతాయని తెలిపారు.
యూపీఐ వినియోగంపై లేదా లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించే ప్రతిపాదనలు ఈ బిల్లులో లేవని ఆర్థిక మంత్రి పునరుద్ఘాటించారు. పన్ను నిబంధనల్లో మరింత స్పష్టత తీసుకురావడంతో పాటు వాటిని సులభతరం చేయడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతో యూపీఐని నిత్యావసర చెల్లింపులకు ఉపయోగిస్తున్న కోట్లాది మంది సాధారణ వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారులకు కూడా ఈ ప్రకటన భారీ ఊరటనిచ్చింది.








